కూకట్ పల్లి మణిహారంగా నల్ల చెరువు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

కూకట్ పల్లి మణిహారంగా నల్ల చెరువు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ/ కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లికి మణిహారంగా నల్ల చెరువును అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా కమిషనర్​ఏవీ రంగనాథ్​ తెలిపారు. కూకట్ పల్లి నల్లచెరువు అభివృద్ధి ప‌‌నుల‌‌ను ఆదివారం ఆయన  ప‌‌రిశీలించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్​కు అంత‌‌రాయం లేకుండా చూడాల‌‌ని సంబంధిత అధికారులకు సూచించారు. సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భ‌‌ద్రత‌‌ను ప‌‌టిష్టం చేయాల‌‌న్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు  ఏర్పాటు చేయాల‌‌ని సూచించారు. 

పెద్దవారు సేద దీరేలా గ‌‌జ‌‌బోలు (విశ్రాంతి మందిరాలు) నిర్మించాల‌‌ని,  చెరువుకు న‌‌లువైపులా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయాల‌‌న్నారు. చెరువు చుట్టూ  ప్లాంట్స్ నాటాల‌‌ని, ఇక్కడికి వ‌‌స్తే ఆరోగ్యం అభివృద్ధి చెందేలా చూడాల‌‌న్నారు. ఇవ‌‌న్నీ యుద్ధప్రాతిప‌‌దిక‌‌న పూర్తి చేయాల‌‌ని అధికారులను ఆదేశించారు. కూక‌‌ట్‌‌ప‌‌ల్లి న‌‌ల్ల చెరువు ఆక్రమ‌‌ణ‌‌ల‌‌తో 16 ఎక‌‌రాలుగా మిగిలిపోగా.. రెవెన్యూ, గ్రామ రికార్డులను పరిశీలించి 30 ఎక‌‌రాల్లో ఈ చెరువును విస్తరించింది. 

చెరువులోకి జ‌‌రిగి ఎఫ్‌‌టీఎల్ ప‌‌రిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డుల‌‌ను అప్పట్లోనే  తొల‌‌గించినట్లు తెలిపారు.  చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాల‌‌తో పాటు ద‌‌శాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక‌‌ను పూర్తిగా తొల‌‌గించ‌‌డంతో 4 మీట‌‌ర్ల లోతు పెరిగిందన్నారు.  కేవ‌‌లం 6 నెల‌‌ల్లో 30 ఎక‌‌రాల మేర చెరువు త‌‌యార‌‌య్యింద‌‌ని  తెలిపారు.