48 గంటలు భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రాకండి

48 గంటలు భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రాకండి

హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 (ఎల్లుండి) వరకు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలకు ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను, మంత్రులను,అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజులు సెలవులు రద్దు చేశారు. 

హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో  సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన చెప్పారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్నవాళ్ళని ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు.   హైదరాబాద్ జిల్లాలో 58  ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు.

మరో వైపు   హైదరాబాద్ లో  భారీ వర్షాలకు హైడ్రా సన్నద్ధంగా ఉందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ అధికారుల సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీళ్లు వస్తే పబ్లిక్ ను రెస్క్యూ చేయడానికి బోట్స్ తో సహా అన్ని ఎక్విప్మెంట్స్ సిద్ధంగా పెట్టుకున్నామన్నారు.  రాత్రి సమయంలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలుండటంతో ఈ రోజు రాత్రి హైడ్రా టీమ్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ALSO READ : తెలంగాణలోని పది జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ

నాలాల కబ్జాలతో రోడ్లపై వరద నీళ్లు వస్తున్నాయని రంగనాథ్ చెప్పారు.  ఓ ఆర్ ఆర్ పరిధిలో 400 కి పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయన్నారు.  మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ఇప్పటికే సిబ్బంది ఉన్నారని తెలిపారు. అత్యవసరమైతే తప్ప పబ్లిక్ బయటకి రావొద్దని సూచించారు. ఒకవేళ భారీ వర్షాలు వస్తే యూత్ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు రంగనాథ్.