హైటెక్ సిటీలో.. మరో భూకబ్జాకు హైడ్రా అడ్డుకట్ట.. కొండాపూర్లో 86 కోట్ల ల్యాండ్ సేఫ్

హైటెక్ సిటీలో.. మరో భూకబ్జాకు హైడ్రా అడ్డుకట్ట.. కొండాపూర్లో 86 కోట్ల ల్యాండ్ సేఫ్

హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: హైటెక్​ సిటీలో మరో భూకబ్జాను హైడ్రా అడ్డుకుంది. దాదాపు రూ.86 కోట్ల విలువైన 4,300 గజాల స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడి చుట్టూ ఫెన్సింగ్​ వేసింది. కొండాపూర్ ​రాజరాజేశ్వరి నగరంలో ఉస్మానియా యూనివర్సిటీ టీచ‌ర్స్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో1978లో గ్రామ పంచాయతీ లేఅవుట్‌ వేశారు. ఇందులో పాఠశాల భవనంతో పాటు ఇతర ప్రజావసరాల కోసం 4,300 గజాల స్థలం ఉంది. ఈ స్థలానికి ఫేక్​డాక్యుమెంట్లు సృష్టించి మూడు భాగాల్లో కొళ్ల మాధ‌వ‌రెడ్డి డెవ‌ల‌ప్​మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుని దందా న‌డుపుతున్నారని,  కాలనీ ప్రతినిధులు జీహెచ్ఎంసీకి గతంలో ఫిర్యాదులు చేశారు.

ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవల హైడ్రాను సంప్రదించారు. దీంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు. శనివారం 4,300 గజాల స్థలంలో ఆక్రమణలను తొలగించి, స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులను ఏర్పాటు చేశారు. భూమిని అమ్మిన పోచయ్య, రాజుతో పాటు స్థలాన్ని కొన్న కొళ్ల మాధవరెడ్డి తో పాటు అతని కొడుకుపైన హైడ్రా అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు క్రిమినల్ కేసులను న‌మోదు చేశారు.

మచ్చబొల్లారంలో పార్కు స్థలానికి ఫెన్సింగ్
మేడ్చల్–- మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లం మ‌చ్చబొల్లారంలోని ఓ పార్కును హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 164లో  శ్రీ సాయి సూర్య  ఫేజ్-2లో పార్కు కోసం దాదాపు 520 గ‌జాల స్థలాన్ని అప్పట్లో కేటాయించారు.  1972లో వేసిన ఈ లేఅవుట్​లో పార్కు స్థలాన్ని క‌బ్జా చేసేందుకు కొంత‌మంది ప్రయ‌త్నిస్తున్నార‌ని కాల‌నీ నివాసితులు హైడ్రాకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారుల‌తో హైడ్రా విచార‌ణ పూర్తి చేసింది. శ‌నివారం ఉద‌యం పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేశారు.