
- 12.50 ఎకరాల భూమి స్వాధీనం
- ప్రభుత్వ భూమి అంటూ బోర్డుల ఏర్పాటు
- బంజారాహిల్స్‌లో భూమి విలువ రూ.750 కోట్లు
హైదరాబాద్ సిటీ/ జూబ్లీహిల్స్, వెలుగు: గ్రేటర్ పరిధిలో హైడ్రా శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి, సుమారు 12.50 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ భూమి విలువ రూ.1100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. బంజారాహిల్స్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో కబ్జాలను తొలగించి, ప్రభుత్వ భూమిని కాపాడింది.
నగరం నడిబొడ్డున.. బౌన్సర్లు, వేట కుక్కలు పెట్టి
షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్10లోని సర్వే నంబర్403లో ఐదెకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణల నుంచి విడిపించింది. ఈ భూమి విలువ రూ. 750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బసవతారకం క్యాన్సర్దవాఖాన పక్కన ఉన్న ఈ స్థలంలో పార్థసారథి అనే వ్యక్తి.. లేని సర్వే నంబర్(403/52)తో అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక్కడే తాగునీటి వ్యవస్థ కోసం 1.20 ఎకరాల భూమిని జలమండలికి కేటాయించినప్పటికీ, అక్కడ పనులు చేయకుండా అడ్డుకున్నట్లు మరో ఫిర్యాదు వచ్చింది. దీంతో హైడ్రా ఫీల్డ్లెవెల్లో పరిశీలన జరిపిన హైడ్రా ఈ ఆక్రమణలను తొలగించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమిగా గుర్తించే బోర్డులు ఏర్పాటు చేసింది. పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కబ్జా చేసిన స్థలంలో ఫెన్సింగ్ వేసి షెడ్లు నిర్మించాడని, బౌన్సర్లను కాపాలా పెట్టి ఎవరూ రాకుండా అడ్డుకున్నాడని, వేట కుక్కలతో అక్కడికి వచ్చినవారికి భయపెట్టాడని కంప్లయింట్స్ వెళ్లాయి. దీంతో హైడ్రా అక్కడి ఆక్రమణలను నేలమట్టం చేసి ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేసింది.
గాజుల రామారం, మేడ్చల్‌లో..
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం మహాదేవపురంలో పార్కులు, ప్రజావసరాల కోసం ఉద్దేశించిన 3.50 ఎకరాల స్థలంలో ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించింది. మేడ్చల్ విలేజ్‌లో ఏజీ ఆఫీసు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో పార్కులు, రహదారుల కోసం కేటాయించిన మూడెకరాల భూమిని కూడా కబ్జా నుంచి విముక్తి చేసింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టి అన్నారం విలేజ్‌లోని శ్రీలక్ష్మి గణపతి కాలనీలో 680 గజాల పార్కు స్థలంలో ఆక్రమణలను నేలమట్టం చేసింది. ఇక్కడ ఓ వ్యక్తి 270 గజాల ప్లాట్‌ను తనదంటూ పాగా వేసేందుకు ప్రయత్నించగా, స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు తీసుకొని, స్థలాన్ని కాపాడి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
నల్ల చెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి
కూకట్పల్లి: కూకట్పల్లి నల్ల చెరువుని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను హైడ్రా కమిషనర్ఆదేశించారు. నల్ల చెరువు సుందరీకరణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో 17 ఎకరాలకు కుదించుకుపోయిన చెరువుని కబ్జాదారుల నుంచి కాపాడి 27 ఎకరాలకు పెంచామని గుర్తు చేశారు.
చెరువు చుట్టూ పాత్ వేను వాకర్స్‌కు అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చెరువు ప్రధాన ప్రవేశ ద్వారం వెడల్పు పెంచాలని, అందరికీ ఉపయోగపడేలా పార్కుని అభివృద్ధి చేయాలని ఆయన జలమండలి అధికారులకు సూచించారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా కాలువ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు.