
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్‌మెంట్ హోర్డింగులను ఆదివారం లోపు తొలగించాలని ఆయా ఏజెన్సీలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. తొలగించకపోతే హైడ్రా స్వయంగా తొలగిస్తుందని హెచ్చరించారు. సోమవారం హైడ్రా ఆఫీసులో ఏజెన్సీల ప్రతినిధులతో రంగనాథ్ సమావేశమయ్యారు. మూడు నెలల నుంచి తొలగించాలని చెబుతున్నామని, ఇప్పటికే ఏజెన్సీలకు చాలా సమయం ఇచ్చామని సీరియస్ అయ్యారు.
2023 మార్చి 31 వరకు చెల్లింపులు చేసిన హోర్డింగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు తొలగించబోమని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అడ్వర్టైజ్‌మెంట్ హోర్డింగుల ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, ప్రస్తుతం దాదాపు రూ.20కోట్ల నుంచి రూ. 30 కోట్లు మాత్రమే వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయన్నారు. బాలాపూర్‌లో అనుమతి లేని అడ్వర్టైజ్‌మెంట్ హోర్డింగులను తొలగించినప్పుడు అఖిల యాడ్ ఏజెన్సీ యజమాని తమను తప్పుదోవ పట్టించారని పలువురు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు.