
- నిరుడు ఇదే టైంలో 1517.47 మిలియన్ యూనిట్లు
- తక్కువకే కరెంటు ఉత్పత్తితో విద్యుత్ సంస్థలకు రూ.900 కోట్లు ఆదా
- జెన్ కో ఆధ్వర్యంలో రోజుకు 45 మిలియన్ యూనిట్ల ప్రొడక్షన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావంతో జల విద్యుత్ ఉత్పత్తి బాగా పెరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా పెరగడంతో హైడల్ పవర్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 2,903.14 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ నెల 5 నాటికి ఈ సంఖ్య దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో 1,517.47 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి కాగా, ఈ ఏడాది ఉత్పత్తి రెట్టింపు స్థాయిలో నమోదైంది. భారీ వర్షాలు, వరదలతో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పెరగడంతో జల విద్యుత్ ఉత్పత్తి ఊపందుకోవడం, వరద నీటిని పవర్ హౌస్‌ల ద్వారా వినియోగించడం వల్ల తక్కువ ఖర్చుతో భారీగా కరెంట్ ఉత్పత్తి సాధ్యమైంది. దీంతో విద్యుత్ సంస్థలు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందడమే కాకుండా వ్యవసాయ రంగంలో పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా తీర్చగలుగుతున్నాయి.
తప్పిన కరెంటు కొనుగోలు భారం
జల విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ఒక్కో యూనిట్‌కు రూ.2 కన్నా తక్కువ కాగా, థర్మల్ పవర్ ఉత్పత్తికి సగటున రూ.5 ఖర్చవుతోంది. దీంతో ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.3 ఆదా అవుతోంది. ఈ సీజన్‌లో ఉత్పత్తి అయిన 3 వేల మిలియన్ యూనిట్ల జల విద్యుత్‌తో విద్యుత్ సంస్థలకు దాదాపు రూ.900 కోట్ల లాభం చేకూరిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజువారీ విద్యుత్ వినియోగం 245 మిలియన్ యూనిట్లకు పైగా ఉండగా, ఇందులో 30 శాతం వరకు జల విద్యుత్ ద్వారా సమకూరుతోంది. దీంతో విద్యుత్ కొనుగోళ్ల భారం నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు గట్టెక్కాయి.
శ్రీశైలం, సాగర్‌లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి
రాష్ట్రంలో మొత్తం 2,440 మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యం ఉండగా, శ్రీశైలం (900 మెగావాట్లు), నాగార్జున సాగర్ (815 మెగావాట్లు), అప్పర్ జూరాల (234 మెగావాట్లు), లోయర్ జూరాల (240 మెగావాట్లు) ప్రాజెక్టులు ప్రధానంగా ఉత్పత్తికి దోహదపడుతున్నాయి. శ్రీశైలంలో రోజుకు 17 నుంచి -18 మిలియన్ యూనిట్లు, సాగర్ లో 19.67- నుంచి 19.80 మిలియన్ యూనిట్లు, అప్పర్ జూరాలలో 4.21-నుంచి 4.38 మిలియన్ యూనిట్లు, లోయర్ జూరాలలో 4- నుంచి 4.22 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతున్నది. దీంతో జెన్‌కో ఆధ్వర్యంలో రోజుకు 48.64 నుంచి 49.11 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ సమకూరుతోంది. గత 50 రోజులుగా జల విద్యుత్ ఉత్పత్తి అత్యధిక స్థాయిలో కొనసాగుతోంది. ఈ నెల 1 నుంచి 5 వరకు రోజుకు 48 మిలియన్ యూనిట్లకు తక్కువ కాకుండా 250 మిలియన్ యూనిట్ల పవర్ జనరేట్ అయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 5 వరకు నెలవారీ ఉత్పత్తి 3 వేల మిలియన్ యూనిట్లు ఉండగా లాస్ట్ ఇయర్ ఇప్పటి ఉత్పత్తిలో సగమే ఉండడం గమనార్హం.
నెలవారీగా హైడల్ పవర్ జనరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.. (మిలియన్ యూనిట్లలో)
ఏప్రిల్: 56.53 ఎంయూలు
మే: 84.39 ఎంయూలు
జూన్: 251.82 ఎంయూలు
జులై: 958.15 ఎంయూలు
ఆగస్టు: 1,358.68 ఎంయూలు