మన దేశంలో కొన్ని కోట్ల మందిని షుగర్, బీపీ, క్యాన్సర్, పీసీఓఎస్ లాంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వాటిని జయించాలంటే డాక్టర్ ఇచ్చే మందులతోపాటు ప్రత్యేకమైన ఫుడ్ కూడా తీసుకోవాలి. కానీ.. ఈ బిజీలైఫ్‌లో అలాంటి ఫుడ్‌ని తయారుచేసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే అలాంటివాళ్లకు మేమున్నాం అంటున్నారు ఈ ముగ్గురు స్నేహితులు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవాళ్లకు న్యూట్రిషనిస్ట్‌లు సూచించిన ఫుడ్ అందించేందుకే వీళ్లు ‘హైపోథాలమస్’ని స్థాపించారు. దీని ద్వారా హెల్దీ ఫుడ్‌ని డెలివరీ చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు.
ముంబైకి చెందిన మీరా సుబ్రమణియన్ కొన్నాళ్ల నుంచి టైప్–2 డయాబెటిస్, కొలెస్ట్రాల్, రక్తపోటుతో బాధపడుతోంది. సాధారణంగా 4–5.6 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ ఏవన్‌సీ లెవల్ రెండు నెలల క్రితం ఆమెకు 7.3కి పెరిగింది. డాక్టర్‌ని కలిస్తే.. రక్తంలో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కచ్చితంగా డైట్ మీల్ తీసుకోవాలని సూచించాడు. లేదంటే మరిన్ని సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించాడు. ఆమె ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. వయసు 63 ఏండ్లు. ఆ వయసులో ప్రతిరోజూ పెద్దగా కష్టపడలేక ఈజీగా వండగలిగే అన్నం, కూరలు మాత్రమే తినేది. “నా కుటుంబాన్ని చూసుకునే క్రమంలో నేను రోజూ డైట్ పాటించలేకపోయా.
డాక్టర్ చెప్పిన ఫుడ్ ప్రిపరేషన్‌కి చాలా టైం పడుతుంది. అందుకే వండుకోలేకపోయా. దాంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. అప్పుడే నాకు ఫుడ్ డెలివరీ స్టార్టప్ ‘హైపోథాలమస్’ గురించి తెలిసింది. హైపోథాలమస్ వాళ్లు నాకు రోజుకు ఆరు హెల్దీ మీల్స్ అందిస్తున్నారు. వాటిలో రకరకాల కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నా కొత్త మీల్ ప్లాన్‌లో ఉదయం క్వినోవా, పోహా, మధ్యాహ్న భోజనంలో సలాడ్‌తోపాటు మునగకాయల కూర, ఓట్స్ దాల్ చీలా, సాయంత్రం డ్రై ఫ్రూట్స్, రాత్రి కోడో మిల్లెట్, పాలకూర అన్నం, చియా సీడ్స్ లాంటివి తీసుకున్నా. ఈ మెనూలోని ఫుడ్‌లో ప్రొటీన్లు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దాంతో నా ఆరోగ్యం చాలావరకు కుదుటపడింది. హెచ్‌బీఏవన్‌సీ లెవల్స్ కూడా కొంతవరకు అదుపులోకి వచ్చాయి. దాంతో డాక్టర్ మందుల డోసేజ్ కూడా తగ్గించాడు” ” అంటూ చెప్పుకొచ్చింది మీరా.
23 ఏళ్ల శ్రీ హర్ష తన ఫ్రెండ్స్‌తో కలిసి పోయినేడు హైపోథాలమస్ స్టార్టప్‌ని మొదలుపెట్టాడు. దీని ద్వారా ముఖ్యంగా హెల్దీ డైట్ మీల్స్, బ్యాలెన్స్‌డ్ మీల్స్ హోమ్ డెలివరీ చేస్తున్నారు. షుగర్, క్యాన్సర్, ఊబకాయం, రక్తపోటు, థైరాయిడ్, పీసీవోఎస్, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఎంతోమంది రోగులకు సర్వీసులు అందిస్తున్నారు.
డెంగ్యూ రావడంతో..
ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన శ్రీ హర్ష 2018లో ఉన్నత చదువుల కోసం ముంబైలోని ఎంజీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో చేరాడు. రెండేండ్ల తర్వాత అతను అనారోగ్యంతో అక్కడే ఒక హాస్పిటల్‌కు వెళ్లాడు. డాక్టర్లు డెంగ్యూ ఉన్నట్లు తేల్చారు. సాధారణంగా 1.5 నుంచి 4.5 లక్షలు ఉండాల్సిన ప్లేట్‌లెట్ కౌంట్ 60 వేలకి తగ్గింది. వికారం, తీవ్రమైన వాంతులతో బాధపడ్డాడు. అన్నం, రొట్టెలు లాంటివి తినలేని పరిస్థితికి వచ్చాడు. దాంతో డాక్టర్లు బొప్పాయి ఆకు, పండ్ల రసాలు లాంటివి తాగాలని సలహా ఇచ్చారు. కానీ.. హర్ష ముంబైలో సింగిల్‌గా ఉంటున్నాడు. కావాల్సినవి చేసి పెట్టడానికి ఎవరూ తోడులేరు. అతను చేరిన హాస్పిటల్‌లోని క్యాంటీన్‌లో కూడా డాక్టర్లు సూచించిన ఫుడ్ అందుబాటులో లేదు. దాంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో వెతికాడు. కానీ, వాటిలో కూడా దొరకలేదు. హాస్పిటల్‌లో ఉన్న ఐదు రోజులు చాలా ఇబ్బందిపడ్డాడు. ‘‘నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నాలాగే చాలామంది రోగులు సరైన ఫుడ్ లేక ఇబ్బందిపడుతున్నారని అర్థమైంది. మన దేశంలో ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా షుగర్, క్యాన్సర్, మూత్రపిండాల సమస్యలతో పోరాడుతున్నారు. అలాంటివాళ్లకు కూడా వ్యాధికి తగ్గట్టు నిర్దిష్టమైన ఆహారం దొరకడంలేదు. రోగి లక్షణాలను బట్టి ఫుడ్ తయారుచేసి, డెలివరీ చేసే సర్వీస్ ఒక్కటి కూడా లేదు. అందుకే అలాంటి సర్వీస్ అందించే ఒక స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకున్నా” అని చెప్పుకొచ్చాడు శ్రీహర్ష. ఆ తర్వాత తన ఫ్రెండ్ శరత్ చంద్రని కలిసి స్టార్టప్ ప్లాన్ గురించి చెప్పాడు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత ఇద్దరూ కలిసి స్టార్టప్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పుడే క్లినికల్ డైటీషియన్ నిరాలి పారిఖ్ కూడా వాళ్లతో చేరి స్టార్టప్‌కి కో–ఫౌండర్ అయ్యింది.
రోజుకు ఆరు సార్లు
స్టార్టప్ ప్రారంభించినప్పటి నుంచి హైపోథాలమస్ టీం ముంబైలోని లైఫ్‌కేర్, లీలావతితో సహా మరికొన్ని ఫేమస్ హాస్పిటల్స్‌కి సర్వీసులు అందిస్తోంది. హైపోథాలమస్‌లోని క్లినికల్ డైటీషియన్లు డాక్టర్ల నుంచి రోగి వివరాలు, ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు, కోలుకునే కాలం లాంటివి తెలుసుకుంటారు. వాటి ఆధారంగా డైట్ చార్టులను తయారు చేస్తారు. మెనూలో టోఫు, ఆనపకాయ, మిల్లెట్ దోస, కిచిడి నుంచి బ్రౌన్ రైస్ దోస, యాలకుల పాల వరకు అన్నీ ఉంటాయి. ప్యాకేజీలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్, రాత్రి భోజనం, బెడ్‌సైడ్ ఫుడ్ లాంటివి అందిస్తున్నారు. రోజులో మూడుసార్లు ఫుడ్ డెలివరీ చేస్తారు. ఒక్కో ప్యాకేజీలో రెండు సార్లు తినడానికి కావాల్సిన ఫుడ్ ఉంటుంది. ఒక్కో వ్యక్తి నుంచి రోజుకు రూ. 600 నుంచి 900 వరకు చార్జ్ చేస్తున్నారు.
ఆరు నెలలు పట్టింది
స్టార్టప్ పెట్టగానే వాళ్లకు సక్సెస్ రాలేదు. మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి, డాక్టర్ల నమ్మకాన్ని పొందడానికి శ్రీహర్షకు ఆరు నెలలు టైం పట్టింది. అసలే అతనికి బిజినెస్‌లో అనుభవం లేదు. పైగా చిన్న వయసు.. అందుకే నెట్‌వర్క్‌ను మెయింటెయిన్ చేయగలడా? లేదా? అని చాలామంది సందేహించారు. మొదట్లో కిచెన్, చెఫ్‌లను మెయింటెయిన్ చేయడం కూడా అతనికి పెద్ద టాస్క్‌లా అనిపించింది. కానీ.. అనుభవం వచ్చాక చాలా ఈజీగా మెయింటెయిన్ చేస్తున్నాడు. రూ. 15 లక్షల ప్రారంభ పెట్టుబడితో కంపెనీని మొదలుపెట్టారు. ఇప్పుడు నెలకు రూ. 7 లక్షల ఆదాయం వస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి బెంగళూరులో కూడా సర్వీసులు మొదలుపెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా రోగులకు ఎండ్-టు-ఎండ్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీని అందించడం, ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవాళ్లకు హెల్దీ ఫుడ్‌ని డెలివరీ చేసి వాళ్ల ‘ఆరోగ్యం’ మీద అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టారు.
అంతేకాదు..
పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఎదగడానికి, బరువు పెరగడానికి ప్రత్యేకంగా న్యూట్రిషన్ ఫుడ్‌ని కూడా డెలివరీ చేస్తున్నారు.
ఫుడ్‌తోనే ఆరోగ్యం
‘‘సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల యువత, ముఖ్యంగా ఐటీలో పనిచేసే వాళ్లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏది పడితే అది ఇష్టమొచ్చినట్టు తినే లైఫ్‌స్టయిల్‌ని మన ఎండోక్రైన్ వ్యవస్థ ఇష్టపడదు. దాంతో ఊబకాయం, పీసీవోఎస్ లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. 1980ల్లో ఈ వ్యాధుల గురించి చాలా అరుదుగా విన్నాం. కానీ, ఇప్పుడు ప్రతిరోజూ పీసీవోఎస్, ఇన్‌ఫెర్టిలిటీ, జెస్టేషనల్ డయాబెటిస్, బీపీ రోగులను చూస్తున్నాం. అలాంటివాళ్లకు పోషకాలుండే భోజనం అందించడం వల్ల ఆరోగ్యాన్ని కొంతైనా మెరుగుపరచవచ్చు” అంటున్నారు ఎక్స్పర్ట్స్.
ఆ పేరే ఎందుకు?
కంపెనీకి హైపోథాలమస్ అనే పేరు పెట్టడానికి చాలా పెద్ద కారణమే ఉంది. హైపోథాలమస్ అనేది మెదడులో ఉండే ఒక ముఖ్యమైన గ్రంథి. ఇది బాడీ టెంపరేచర్, ఆకలి, దాహం, నిద్ర లాంటి ప్రాథమిక విధులను నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థల మధ్య వారధిగా పనిచేస్తుంది. అందుకే ఇది మన ఆహారపు అలవాట్లకు కారణం అవుతుంది. హైపోథాలమస్ కూడా ఆరోగ్య స్పృహ ఉన్నవాళ్ల, రోగుల ఆహారపు అలవాట్లను నియంత్రించడంలో సాయం చేస్తుంది. అందుకే స్టార్టప్‌కి ఆ పేరు పెట్టారు.
