
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ప్రఖ్యాత హ్యుందాయ్ మోటార్స్ సంస్థ తన సరికొత్త మెగా టెస్టింగ్ సెంటర్ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. భారీ ఎత్తున ఏర్పాటు కానున్న ఈ టెస్టింగ్ సెంటర్‌లో ఆటో మేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం (ఈవీలు కూడా) ఉంటుంది.
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. హ్యుందాయ్ మోటార్స్ అనుబంధ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎంఐఈ) ద్వారా రాష్ట్రంలో మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఇంజినీరింగ్ కేంద్రాన్ని ఆధునీకరించి, విస్తరించడానికి కూడా పెట్టుబడులు పెడ్తామని హ్యుందాయ్ మోటార్స్ తెలిపింది.
తెలంగాణలో ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణతోపాటు కొత్తగా మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తమ బిజినెస్ ఎక్స్పాన్షన్కు ఎంతో కీలకమని హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటి అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ విధానాలు తెలంగాణలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హ్యుందాయ్ మోటార్స్ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో హ్యుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు ద్వారా అనుబంధ సంస్థలు కూడా రానున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో..!
వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపాయి. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ భేటీలో సీఎం ప్రసంగించారు.
టెక్స్‌టైల్ రంగం విస్తృత్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు స్థానిక కంపెనీలతోపాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ఆయన వివరించారు. యంగాన్ కార్పొరేషన్ చైర్మన్ కియాక్ సంగ్ , కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సొయంగ్ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రానికి రానున్న ఎల్ఎస్ ప్రతినిధులు
దక్షిణ కొరియాలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులు త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్కు జా యున్ నేతృత్వంలోని ఆ కంపెనీ సీనియర్లతో సమావేశమైంది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుళ్లు, గ్యాస్, విద్యుత్, బ్యాటరీల ఉత్పత్తి, పెట్టుబడులపై చర్చలు జరిగాయి. సీఎం ఆహ్వానం మేరకు ఎల్ఎస్ గ్రూప్ త్వరలోనే రాష్ట్రానికి రానుంది.
ఎల్ఎస్ కంపెనీ గతంలో ఎల్‌జీ గ్రూప్‌లో భాగస్వామిగా ఉండేది. ప్రపంచ ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ వ్యవస్థాపకులైన ఎల్ఎస్ కుటుంబాన్ని కలవడంతోనే తన సౌత్ కొరియా పర్యటన ప్రారంభం కావడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.