KCRకు నేనే ప్రత్యామ్నాయం.. అందుకే నా పాదయాత్రను అడ్డుకుంటున్నారు: షర్మిల

KCRకు నేనే ప్రత్యామ్నాయం.. అందుకే  నా పాదయాత్రను అడ్డుకుంటున్నారు: షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కు తానే ప్రత్యామ్నాయం కాబట్టి.. అందుకే పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తన పాదయాత్రతో కేసీఆర్ కు వణుకు పుడుతోందన్నారు. తెలంగాణలో మిగతా పార్టీల నేతల పాదయాత్రలకు అనుమతిస్తూ.. తన పాదయాత్రకు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు  తాలిబన్ భాష వాడుతున్నారని షర్మిల దుయ్యబట్టారు.

ప్రజా సమస్యలపై పోరాటం..

టీఆర్ఎస్ మహిళా నేతలు లిక్కర్ స్కాంలో ఉంటే తాను మాత్రం ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని షర్మిల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చురకలంటించారు. మహిళా నేత అయి ఉండి లిక్కర్ స్కాం లో ఉండడం ఏంది ? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డికు ఉన్న ఆదరణ చూస్తే భయం వేస్తోందన్నారు. తన పాదయాత్ర కు వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ కు  వణుకుపుడుతోందన్నారు. 

మూడుసార్లు పాదయాత్ర అడ్డుకోవాలని చూశారు

హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా తన పాద యాత్ర అడ్డుకోవాలని చూశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ వయోలేషన్ కేసులో తనను పోలీసులు ఎందుకు రిమాండ్ కోరారని ప్రశ్నించారు. కేసీఆర్ పోలీసులను తన జీతగాళ్ల మాదిరిగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం టీఆర్ఎస్ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారని షర్మిల విమర్శించారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతిని..ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే కేసీఆర్ కు వణుకుపుడుతోందన్నారు. తమ వాహనాలను తగలబెట్టి వైఎస్ఆర్టీపీ కార్యకర్తల్ని కొట్టింది టీఆర్ఎస్ గూండాలేనని షర్మిల ఆరోపించారు.

అక్రమ కేసులు పెట్టారు..

వ్యక్తిగత దూషణలకు దిగింది తాను కాదని షర్మిల అన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, నేతల అవినీతిని  మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. మంత్రి హోదాలో ఉండి నిరంజన్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని గుర్తు చేశారు. దీనికి తోడు తనపైనే కేసులు పెట్టి చిత్ర హింసలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యేల ప్రాంతాల్లో పబ్లిక్ ఫోరమ్ ఏర్పాటు చేసి నిరూపించుకోవాలన్నారు. 2018 ఎన్నికలలో కేసీఆర్ ఇచ్చిన  హామీలు అమలు చేయనందుకే ఆయనకే  షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు.