నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

దేశంలో ఆంగ్ల భాష‌కు ప్రత్యామ్నాయంగా హిందీని ఆమోదించాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఇది భారతదేశ బహుళత్వంపై దాడి అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. రాజ్‌నాథ్ సింగ్ హోం మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో పేర్కొన్నట్లు హిందీ ‘రాజ్ భాష’ (అధికారిక భాష) అని.. ‘రాష్ట్ర భాష’ (జాతీయ భాష) కాదని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వాదించారు. ‘హిందీ సామ్రాజ్యవాదం దేశానికి మరణశాసనం అవుతుంది. నేను హిందీతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను, కానీ అందరూ హిందీ మాట్లాడాలనుకోను. అమిత్ షా వ్యాఖ్య‌లు హిందీకి కీడు చేసేలా ఉన్నాయి’ అని జైరాం రమేష్ ట్విట్టర్‌లో అన్నారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. హోంమంత్రి హిందీ గురించి మాట్లాడకూడని ఉపన్యాసం ఇచ్చేందుకు ప్రయత్నించారని అన్నారు. అమిత్ షా హిందీ గురించి ప్రబోధించడానికి ప్రయత్నించారు. హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం.. విభజన రాజకీయాలను పురిగొల్పడమే. హిందీ అంశాన్ని లేవనెత్తడం ద్వారా.. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి హోం మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అమిత్ షా ప్రకటనపై తూత్తుకుడి ఎంపీ కనిమొళి కూడా తీవ్రంగా స్పందించారు. ‘ఒకే భాష అనే ఆలోచనను తీసుకురావడం వల్ల దేశాన్ని ఏకం చేయడం ఏమో కానీ, ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయి. హిందీ వ్యతిరేక ఉద్యమాల చరిత్ర, దాని కోసం చేసిన త్యాగాల గురించి కేంద్ర ప్రభుత్వం, మంత్రులు తెలుసుకోవాలి’ అని ఆమె అన్నారు. షా ప్రకటన దిగ్భ్రాంతి కలిగించిందని పీఎంకే నేత రాందాస్ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు అర్థం హిందీ రుద్దడమే తప్ప మరోటి కాదన్నారు. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు, వారి భావాలను గౌరవించాలన్నారు. 

అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని ఆయన అన్నారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మరియు నిజమైన ‘వసుధైక కుటుంబం’. ఇటువంటి గొప్ప దేశంలోని ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాష మాట్లాడాలో వారికి వారు నిర్ణయించుకునే వీలు మనం ఎందుకు కల్పించం. భాషా దురభిమానం భారీగా దెబ్బతిస్తుంది. నేను మొదట భారతీయుడిని, గర్వించదగిన తెలుగువాడిని, అంతేకాకుండా తెలంగాణవాడిని. నా మాతృభాష తెలుగు. అయినా నేను ఇంగ్లీష్, హిందీతో పాటు కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. హిందీని ప్రత్యామ్నాయ భాషగా విధించడం, ఇంగ్లీషును నిషేధించడం అనేది ఈ దేశంలోని యువకులకు పెద్ద అడ్డంకిగా మారనుంది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

For More News..