పదవుల కోసం పార్టీ మారడం లేదు: బూర నర్సయ్య గౌడ్

పదవుల కోసం పార్టీ మారడం లేదు: బూర నర్సయ్య గౌడ్

ఈ నెల 19న బీజేపీలో చేరుతున్నట్లు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ను కలవడం ఇప్పుడొక ఉద్యమంలా మారిందని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రం అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. బీజేపీ సిద్ధాంతమైన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేది తన జీవిత ఫిలాసఫీ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సహా పలువురు బీజేపీ నేతలు బూర నర్సయ్య ఇంటికెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. 

టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ : బండి సంజయ్

టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అని.. బీజేపీ ఉద్యమకారుల పార్టీ అని బండి సంజయ్ అన్నారు. నర్సయ్య నిజాయితీపరుడని.. ఒక ఆశయం కోసం బూర నర్సయ్య రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఉద్యమకారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ను ఒక గ్రామానికి ఇంచార్జ్ గా వేసేలా చేసిన ఘనత బీజేపీదేనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని.. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.