
బెకెన్‌హామ్: దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత టీమిండియా టెస్ట్ జట్టులో మళ్లీ చోటు దక్కడం తన అదృష్టమని వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ అన్నాడు. ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందని చెప్పాడు. ‘నేను రెండోసారి అవకాశాన్ని పొందినందుకు చాలా కృతజ్ఞుడిని, అదృష్టవంతుడ్ని కూడా. ఈ చాన్స్‌ను రెండు చేతులతో ఒడిసి పట్టుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని నాయర్ పేర్కొన్నాడు.
ఇండియా–ఎ జట్టులోని టెస్ట్ ప్లేయర్లు ప్రధాన జట్టులోకి వచ్చిన తర్వాత హెడ్ కోచ్ గంభీర్.. నాయర్ ట్రిపుల్ సెంచరీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘రీ ఎంట్రీ ఎప్పుడూ సులభం కాదు. నీవు చేసిన రన్స్, ఎప్పుడూ వదిలిపెట్టని తత్వం.. జట్టులోని మిగతా ప్లేయర్లందరికీ స్ఫూర్తిదాయకం. నాయర్‌కు తిరిగి స్వాగతం’ అని గౌతీ వ్యాఖ్యానించాడు. ఇక తన రాష్ట్ర జట్టు సహచరుడు కేఎల్ రాహుల్ కూడా నాయర్ గురించి మాట్లాడాడు.
‘నాయర్ నాకు చాలా కాలంగా తెలుసు. అతను యూకేలో క్రికెట్ ఆడుతూ ఎన్నో నెలలు గడిపాడు. ఒంటరిగా చాలా కష్టపడ్డాడు. ఇవన్నీ చేసి తిరిగి టీమిండియాలోకి రావడం అతనికి, ఫ్యామిలీకి, అతని ప్రయాణాన్ని చూసిన మాలాంటి స్నేహితులకు చాలా ప్రత్యేకమైంది. కౌంటీ క్రికెట్‌లో ఆడిన అతని అనుభవం, నేర్చుకున్నవి ఈ టెస్ట్‌ల్లో మాకు పనికొస్తాయని నమ్ముతున్నాం’ అని రాహుల్ వివరించాడు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి తిరిగి రావడం కరుణ్‌కు అవాస్తవంగా అనిపిస్తుండొచ్చన్నాడు.