షింజో అబే మృతిపై ప్రముఖుల సంతాపం..రేపు సంతాపదినం

షింజో అబే మృతిపై ప్రముఖుల సంతాపం..రేపు సంతాపదినం

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. ఉదయం ఆయనపై దుండగుడు కాల్పులు జరుపగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం సేవలందించిన షింజో అబే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప నేతను ప్రపంచం కోల్పోయిందని..ఇది మాటల్లో చెప్పలేని విషాదం అంటూ వరుస ట్వీట్లు చేశారు. షింజో మృతికి నివాళిగా కేంద్రం జులై 9ని సంతాపదినంగా ప్రకటించింది.

‘‘నా ప్రియమైన స్నేహితుడు అబే మరణం నన్ను షాక్ కు గురిచేసింది. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు..అద్భుత పాలకుడు. జపాన్ సహా ప్రపంచాన్ని గొప్పగా మార్చేందుకు ఆయన తన జీవితాన్నే అంకితం చేశారు.’’అంటూ మోడీ ట్వీట్ చేశారు.

‘‘షింజో అబెతో నా పరిచయం ఏళ్లనాటిది. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఆయన గురించి విన్నాను. నేను ప్రధాని అయ్యాక మా బంధం మరింత బలపడింది. ఆర్థిక,  ప్రపంచ వ్యవహారాలపై ఆయనకు ఎంతో అవగాహన ఉంది. అవి నన్ను కూడా ఎంతో ప్రభావితం చేశాయి’’  అని మోడీ ట్వీట్ చేశారు.

‘‘ఇటీవలె నేను జపాన్ లో షింజో అబెను కలిశాను. అనేక అంశాలపై ఆయనతో చర్చించాను. అయితే ఇదే మా చివరి సమావేశం అవుతుందని నాకు తెలియదు..అబె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.

షింజో అబే మృతి పట్ల సోనియా, రాహుల్ విచారం

షింజో అబే మృతి పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన సోనియా  ఓ లేఖ విడుదల చేసింది.

‘‘ ఎన్నో ఏళ్లుగా షింజో భారత్ కు ఒక గొప్ప స్నేహితుడు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. గతంలో ఆయనతో జరిగిన సమావేశాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇది జపాన్ సహా ప్రపంచం మొత్తానికి దురదృష్టకరం. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ సోనియా లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ కూడా షింజో మృతిపట్ల ట్విట్టర్ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్-జపాన్ ల మధ్య వ్యూహాత్మక బంధం బలోపేతం చేయడంలో షింజో పాత్ర ప్రశంసనీయమన్నారు. అబె కుటుంబంతోపాటు జపాన్ ప్రజలకు రాహుల్ సంతాపం ప్రకటించారు.