
అధికారం తమ చేతిలో ఉంటే చాలు ఏమైనా చేయవచ్చనుకుంటారు కొందరు రాజకీయనాయకులు…వారి కుటుంబ సభ్యులు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన వాళ్లే రూల్స్ బ్రేక్ చేస్తుంటారు. అంతే కాదు ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో జరిగింది.
మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఉన్న టోల్‌ప్లాజా దగ్గర ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య, కుటుంబ సభ్యులు శుక్రవారం సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. మంత్రి భార్య తన కారులో హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్నారు. మాడ్గులపల్లి టోల్‌ప్లాజా దగ్గర టోల్ టాక్స్ చెల్లించాలని సిబ్బంది ఆమె కారును ఆపారు. దాంతో ఆమె ‘నేను మంత్రి భార్యను. నా కారుకే టోల్ ఫీజు అడుగుతారా..ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది’అంటూ హల్ చల్ చేశారు. కానీ స్టిక్కర్ పర్మిషన్ టైం దాటిందని, టోల్ రుసుము చెల్లించకుంటే కారు వేళ్లేది లేదని టోల్‌ప్లాజా సిబ్బంది తేల్చి చేప్పారు. స్టిక్కర్ గడువు ముగియడం, కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో టోల్‌ప్లాజా సిబ్బంది ఆర్‌అండ్‌బీ రూల్స్ ప్రకారం టోల్ రుసుము చెల్లించాలని చెప్పారు. మంత్రి భార్య, కుటుంబ సభ్యులు అరగంట సేపు టోల్‌ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏ ఫోన్ చేసి చెప్పినా వారు అనుమతి ఇవ్వకపోవడంతో టోల్ రుసుము చెల్లించి వెళ్లారు. మంత్రి భార్య నిర్వాకంతో టోల్‌ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామైంది.