ఆ క్షణం కన్నీళ్లు ఆపుకోలేకపోయా

ఆ క్షణం కన్నీళ్లు ఆపుకోలేకపోయా

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చిరస్మరణీయ విక్టరీని సాధించింది. రీసెంట్‌‌గా ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌‌లో కంగారూలను వారి సొంత గడ్డపై 2-1 తేడాతో యువ భారత్ ఓడించిన తీరుకు అందరూ ముగ్ధులయ్యారు. ముఖ్యంగా చివరి టెస్టులో భారత్ కుర్రాళ్లు చూపిన తెగువ అందర్నీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు సాధించడంతో తాను కన్నీళ్ల పర్యంతమయ్యానని మాజీ బ్యాట్స్‌‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. బ్రిస్బేన్ విజయంతో తాను ఉద్వేగానికి లోనయ్యానని, సంతోషంతో కన్నీళ్లు వచ్చేశాయన్నాడు.

‘బ్రిస్బేన్‌లో భారత్ విక్టరీ కొట్టడంతో నేను ఉద్వేగానికి లోనయ్యా. నేను చాలా ఎమోషనల్. ఆ మ్యాచ్‌‌ను కుటుంబంతో కలసి చూస్తున్నా. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చాలా ఉత్కంఠకు లోనయ్యా. నేను ఆడట్లేను కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఆసీస్‌‌ను ఓడించి భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలని కోరుకున్నా. ముఖ్యంగా అడిలైడ్‌‌లో ఓటమి తర్వాత గబ్బా టెస్టుకు ముందు జరిగిన పరిణామాలు నాకు నచ్చలేదు. బ్రిస్బేన్‌‌కు వెళ్లడానికి భారత్ భయపడుతోందని కొందరు కామెంట్లు చేశారు. కానీ బ్రిస్బేన్‌‌లో గెలిచిన తర్వాత నాకు కన్నీళ్లు ఆగలేదు. యంగ్ ఇండియాపై నేను చాలా గర్వంగా ఉన్నా. ఆ విజయం గురించి వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు’ అని లక్ష్మణ్ చెప్పాడు.