ఆడబిడ్డలకు అండగా ఉంటా.. ఆదుకుంటా: గవర్నర్​

ఆడబిడ్డలకు అండగా ఉంటా.. ఆదుకుంటా: గవర్నర్​
  • జూబ్లీహిల్స్ ఘటనపై 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలన్నా ఇంకా ఇయ్యలే
  • మహిళలపై అఘాయిత్యాలు కలచివేస్తున్నయ్​
  • బాధితుల గోస ప్రభుత్వానికి వినిపిస్త.. 
  • వాటికి స్పందించాల్సింది ప్రభుత్వమే
  • విమర్శలను పట్టించుకోనని స్పష్టీకరణ
  • రాజ్​భవన్​లో ‘మహిళా దర్బార్​’కు భారీ స్పందన
  • గవర్నర్​కు గోడు చెప్పుకున్న మహిళలు, వృద్ధులు


ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా ప్రజల కోసమే ఉన్నది. ప్రజలను గవర్నర్ కలవడం, ప్రజా దర్బార్ నిర్వహించడం ఏమిటని వస్తున్న విమర్శలను, నన్ను ప్రశ్నిస్తున్న వాళ్లను, నిరసనలను పట్టించుకోను. రాజ్యాంగ విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని విమర్శించే వాళ్లు రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా... ప్రజా దర్బార్ నిర్వహించడంలో రాజకీయం లేదు. ప్రజలను కలవడం కోసమే ఏర్పాటు చేశా. రాజ్ భవన్ నుంచి ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వటానికే నా ప్రయత్నం. బాధితుల గొంతును ప్రభుత్వానికి వినిపిస్తా.. వాటికి స్పందించి, పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు మద్దతు చాలా అవసరం - గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలచివేస్తున్నాయని, గుండె తరుక్కుపోతున్నదని గవర్నర్​ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా తెలంగాణ ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోను. వారికి అండగా ఉంటా. వారిని ఆదుకోవడానికి మరింత బలమైన శక్తిగా ముందుంటా. నన్ను ఎవరూ అడ్డుకోలేరు. మహిళల గెలుపును ఎవరూ ఆపలేరు” అని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్​రేప్​ ఘటనపై  రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని అడిగినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి రిపోర్ట్ రాలేదని గవర్నర్​ తెలిపారు.  ‘‘వాళ్ల టైమ్  స్లోగా ఉందనుకుంటున్నా” అని అన్నారు. రాష్ట్రంలోని మహిళల సమస్యలు తెలుసుకునేందుకు శుక్రవారం రాజ్​భవన్​లో గవర్నర్​​ ‘మహిళా దర్బార్’ను  ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు, కార్యక్రమం చివర్లో ఆమె మాట్లాడారు. 
ఎంతో కాలంగా ప్రజా దర్బార్ ప్రతిపాదన ఉందని, కరోనా వల్ల వాయిదా పడిందని తెలిపారు. ప్రజా దర్బార్ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కరోనా టైమ్ లో సెక్యూరిటీ వద్దన్నా తాను రోగులను కలిసి మాట్లాడానని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళలకు తోడుగా, అండగా ఉంటానన్నారు. ప్రభుత్వానికి, మహిళలకు మధ్య వారధిగా ఉంటానని చెప్పారు.  మహిళలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దర్బార్​లో తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిశీలిస్తానని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాజ్ భవన్ నుంచి వచ్చే వినతులను పరిశీలించాలని ప్రభుత్వ శాఖలకు గవర్నర్​ సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. 
వాళ్లు రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా!
‘‘సీఎం కేసీఆర్​ కలువక ఈ నెల 2 నాటికి ఏడాది పూర్తయింది. నా మెసేజ్ సీఎంకు చేరితే చాలు” అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా గవర్నర్​ చెప్పారు. “రాజ్యాంగ విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నవాళ్లు రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా! కొన్ని విషయాల్లో ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలి” అని ఆమె అన్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ అధికారాలు తీయాలా వద్ద అనేది ప్రభుత్వ విజ్ఞత కు వదిలేస్తున్నానని  పేర్కొన్నారు.

‘‘రాజ్యాంగబద్ధమైన పోస్టులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రొటోకాల్ ప్రభుత్వం ఫాలో కావడం లేదు.. అయినా నేను నా కార్యక్రమాలను ఎక్కడా ఆపలేదు. తెలంగాణలో సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు..అందుకే ఇంత స్పందన వచ్చింది” అని గవర్నర్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరగుతున్న ఘటనలు, సమస్యలపై గవర్నర్ పాలన విధించాలని డిమాండ్లు వస్తున్నాయన్న ప్రశ్నకు..  ‘‘రాష్ట్రంలో పబ్లిక్ ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని గౌరవిస్తా” అని అన్నారు. ‘‘రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రేసులో మీ పేరు వినిపిస్తుంది కదా’’ అని మీడియా ప్రశ్నించగా.. సమాధానమివ్వకుండా నమస్కరించారు.