‘తెలుసు కదా’ చిత్రం కొన్ని సంవత్సరాలపాటు ప్రేక్షకులతో ఉండిపోతుందని సిద్ధు జొన్నలగడ్డ అన్నాడు. నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ అప్రీసియేషన్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాతలు బండ్ల గణేష్, ఎస్‌కేఎన్, రైటర్స్ కోన వెంకట్, బీవీఎస్ రవి, డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ సినిమా సూపర్ హిట్ అవడం ఆనందంగా ఉందని ఇలాంటి కాన్సెప్టులు మరిన్ని రావాలంటూ సిద్ధుని అభినందించారు. సిద్ధు మాట్లాడుతూ ‘నా రీసెంట్ ఫిల్మ్ ‘జాక్’తో ఎమోషనల్ లాస్ ఫీలయ్యా. ఇప్పుడు ఈ చిత్రంతో మనశ్శాంతి ఫీలవుతున్నా.
ఈ సినిమా నన్ను ప్రశాంతంగా పడుకునేలా చేసింది’ అని చెప్పాడు. ఇలాంటి యూనిక్ స్టోరీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ దర్శక నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, నటులు వైవా హర్ష, లిరిసిస్టులు రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.
