పేదోళ్లమే కావచ్చు.. కానీ రూ.10వేలకు అమ్ముడుపోయేదాన్ని కాదు

పేదోళ్లమే కావచ్చు.. కానీ రూ.10వేలకు అమ్ముడుపోయేదాన్ని కాదు

ఉత్తరాఖండ్ రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆమె వాట్సాప్ చాట్ ను  పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు కొన్ని రోజులు ముందు యువతి తాను ఎదుర్కొంటున్న ఒత్తిడిని స్నేహితులతో పంచుకుంది. తాను పేదరాలిని కావచ్చు కానీ 10 వేల రూపాయలకు అమ్ముడుపోయే దానికి కానంటూ చెప్పింది. ఒకసారి తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనను బలవంతంగా కౌగిలించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయాన్ని పెద్దదిగా చేయొద్దని, పుల్కిత్ ఆర్య సహాయకుడు అకింత్ గుప్తా కోరాడని తెలిపింది. మరో మెసేజ్ లో పుల్కిత్ ఆర్య చెప్పినట్టు గెస్టులకు స్పెషల్ సర్వీస్ చేయకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని అకింత్ గుప్తా బెదిరించాడని యువతి వాపోయింది. తనను వాళ్లు వ్యభిచారిగా మార్చాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోసారి స్పెషల్ సర్వీస్ అని ఒత్తిడి తెస్తే రిసార్ట్ లో పని చేయడం మానేస్తానని యువతి తెలిపింది. 

మరోవైపు పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికపై యువతి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాక అంత్యక్రియలు జరపబోమన్నారు. సమగ్రంగా కేసును దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉత్తరాఖండ్ లో హోటల్ రిసెప్షనిస్ట్  హత్య కేసు  దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.  రిసార్ట్ లోని  ప్రతి ఉద్యోగి  నుంచి స్టేట్ మెంట్స్ తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా రిసెప్షనిస్ట్ వాట్సప్  చాటింగ్ పై  కూడా విచారణ  జరుగుతోందని సిట్ ఇంచార్జి,  డీఐజీ  పీఆర్ దేవి చెప్పారు.