భూసేకరణపై నేనెవరినీ బెదిరించలేదు: మంత్రి ఎర్రబెల్లి

భూసేకరణపై నేనెవరినీ బెదిరించలేదు: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్, వెలుగు: కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు భూసేకరణపై తాను ఎవరినీ బెదిరించలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పార్కు కోసం 1100 ఎకరాలు భూమి సేకరించారని, ఒక్క రైతు భూమి ఇవ్వలేదని బాధతో ‘ముప్పు తిప్పలు పెడతాం’ అన్నానని చెప్పారు. ఆ రైతు తన శిష్యుడు యాకస్వామి అని తెలిపారు. తర్వాతి రోజు ఆయన తనకు ఫోన్ చేసి, కలిసి భూమి ఇచ్చేందుకు అంగీకరించారని పేర్కొన్నారు.

మహిళలకు రూ.3 లక్షల రుణం

స్త్రీనిధి, సెర్ప్, మెప్మా సంఘాలను మరింత బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. స్త్రీ నిధి నుంచి మహిళలు రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చని, ఇది వారికి ఆర్థిక భరోసా ఇస్తుందని చెప్పారు. స్త్రీనిధి సంఘ సభ్యుల బ్రోచర్​ను, స్నేహా లోన్ కార్యక్రమాల ప్లకార్డులను, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృధ్ది  శాఖ 2018-–19 నివేదికను విడుదల చేసి మాట్లాడారు. స్త్రీ నిధి నుంచి రుణం తీసుకున్న మొత్తానికి ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామన్నారు. రుణం తీసుకొని సగం చెల్లించిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో రుణ గ్రహీత చనిపోతే ఆ రుణాన్ని ఇన్సూరెన్స్ కింద వచ్చే నిధిలో నుంచి బ్యాంకు చెల్లిస్తుందని చెప్పారు.