జన హోరుకు మోడీ ఫిదా..వారెవ్వా అంటూ..

జన హోరుకు మోడీ ఫిదా..వారెవ్వా అంటూ..

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మోడీ నామస్మరణతో మార్మోగింది. ఆయన ఎంట్రీ ఇస్తున్న  టైంలో సభ మోడీ నినాదాలతో హోరెత్తింది. ఆ హోరుకు మోడీ కూడా ఫిదా అయ్యాడు. చిరునవ్వులు చిందించాడు. వారెవ్వా అంటూ బండి సంజయ్ భుజం తట్టాడు. ఆ తర్వాత తెలుగులో ప్రసంగించి.. నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. బండి సంజయ్ కూడా మోడీ దేవుడు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మీ ప్రేమ నాకు అర్ధం అవుతోంది..

‘‘తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు, సోదర, సోదరీమణులకు, మాతృమూర్తులకు నా నమస్కారం. మీ ప్రేమ నాకు అర్థం అవుతోంది..తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..రాష్ట్రం మొత్తం ఈ మైదానంలో కూర్చునట్లు ఉంది.ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పుట్టినిల్లు. భద్రాద్రి సీతారాముడి నుంచి యాదాద్రి నరసింహస్వామి దాకా.. ఆలంపూర్ జోగుళాంబ నుంచి వరంగల్ లోని భద్రకాళి దాకా అందరి దీవెనలు దేశంపై ఉన్నాయి. రామప్ప నుంచి కాకతీయ తోరణం దాకా తెలంగాణ ఆర్కిటెక్చర్ దేశానికే గర్వకారణం’’ అని మోడీ అన్నారు.  భద్రాచలం రామదాసు నుంచి పాల్కురికి సోమనాథుడి వరకు ఇక్కడి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఇది యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. 

హైదరాబాద్ కాదు భాగ్యనగరం 

ఇక ఈ సభలో ప్రసంగించిన పలువురు నేతలు హైదరాబాద్ ను భాగ్యనగరం అని అనడం గమనార్హం. అమిత్ షా, యోగీ  హైదరాబాద్ ను భాగ్యనగరం అని అన్నారు. అమిత్ షా ఒక్కసారి హైదరాబాద్ అని వెంటనే భాగ్యనగరం అన్నారు. ఇక ఈ సభకి ఓ చిన్న పిల్లాడు మోడీ వేషంతో వచ్చాడు. అచ్చం మోడీలాగే గడ్డం, తలపాగతోపాటు వస్త్రధారణ కూడా ధరించి అందరినీ ఆకట్టుకున్నాడు. 

సభ సక్సెస్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయింది. మోడీ హాజరైన ఈ సభకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఉహించిన దాని కన్నా ఎక్కువ మంది రావడంతో పరేడ్ గ్రౌండ్ పూర్తిగా జనంతో నిండిపోయింది. నిలబడేందుకు సైతం జాగా లేకపోవడంతో చాలా మంది కార్యకర్తలు బయటనే ఉండిపోయారు.