‘డెకాయిట్’ లాంటి సినిమా తీయడం నిర్మాతగా తృప్తిని ఇచ్చింది అన్నారు సుప్రియ యార్లగడ్డ. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకత్వంలో ఆమె నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ గురించి, చిత్ర విశేషాలను గురించి నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఇలా ముచ్చటించారు. ‘‘ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
హరి క్యారెక్టర్‌లో శేష్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శేష్, మృణాల్ క్యారెక్టర్స్‌కు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. స్వతహాగా నాకు లవ్ స్టోరీస్, ఎమోషనల్ డ్రామాలు ఇష్టం. ఇప్పుడు తెలుగులో అవి మిస్ అవుతున్నాయి. అందుకే ‘డెకాయిట్’ కథని నిజాయితీగా చెప్పాలనుకున్నాం. చాలా మంది క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కొంత రిస్క్ అయినప్పటికీ మంచి సినిమాకి ఎప్పుడూ ఆ రిస్క్ ఉంటుంది.
తెలుగుతో పాటు హిందీలోను రెస్పాన్స్ చాలా బాగుంది. ఇక్కడ తీసిన సినిమా అక్కడికి చేరడం హ్యాపీ. తెలుగులో తీసి హిందీ డబ్ చేస్తే బడ్జెట్ తగ్గేదేమో కానీ అన్నింటినీ అలా బడ్జెట్ పరంగా ఆలోచిస్తే సినిమాకి, కథకి న్యాయం చేయలేం. సినిమా అంటే ఓ మేజిక్ ఉండాలి. ఈ కథకు అలాంటి మేజిక్ అవసరం అనిపించి రెండు భాషల్లో తీశాం. పవన్ సింగ్, జోనితా లాంటి స్టార్స్ వుండటం వలన నార్త్‌లో హెల్ప్ అయ్యింది. యస్‌యస్ క్రియేషన్స్‌లో ఇకపై వరుస సినిమాలు చేయాలని ఉంది. సినిమా అంటే నాకు ప్రేమ. సినిమాతో ఆడియన్స్ సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం ఇష్టం. ప్రేమ, త్యాగం, ద్రోహం, మోసం లాంటి ఎమోషన్స్ మన క్లాసిక్ లవ్ స్టోరీస్‌లో ఉంటాయి. ఇలాంటి కథలతో పాటు బలమైన ఫిమేల్ ఫార్వర్డ్ క్యారెక్టర్‌తో సినిమాలు చేయాలనేది నా కోరిక”.

