ఢిల్లీ హాస్పిటల్స్‌కు కేజ్రీవాల్‌ వార్నింగ్‌

ఢిల్లీ హాస్పిటల్స్‌కు కేజ్రీవాల్‌ వార్నింగ్‌
  • కరోనా పేషంట్లకు బెడ్ల కొరత లేదు
  • లక్షణాలు ఉంటే హాస్పిటల్‌లో చేర్చుకోవాలి

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్ల కొరత లేదని, హాస్పిటల్స్‌ వర్గాలు కావాలనే అబద్ధాలు చెప్తున్నారని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాలు చెప్పారు. లక్షణాలతో వచ్చిన వాళ్లను హాస్పిటల్స్‌లో చేర్చుకోవాలని, వాళ్లను వెనక్కు తిరిగి పంపితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో కూడా కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ అందించాలని ఆదేశించారు. బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను తెలుసుకునేందుకు ఢిల్లీ సర్కార్‌‌ మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేసిందని, దాని ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. కొన్ని హాస్పిటల్స్‌లో బెడ్లు ఖాళీ ఉన్నట్లు యాప్‌లో చూపిస్తున్నా కూడా లేవని చెప్తున్నారని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. “ నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి. ఈ బెడ్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ని అరికడతాను” అని కేజ్రీవాల్‌ సీరియస్‌ అయ్యారు. ఢిల్లీలో కరోనా పేషంట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, సరిపడ వెంటిలేటర్లు, హాస్పిటల్స్‌, ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. యాప్‌లో ఖాళీలు ఉన్నట్లు చూపించి, పేషంట్లను చేర్చుకోకపోతే 1031 నంబర్‌‌కు కంప్లైంట్‌ చేయాలని కేజ్రీవాల్‌ చెప్పారు. ఢిల్లీలో కరోనా అప్‌డేట్స్‌, హాస్పిటల్స్‌, బెడ్స్‌ తదితర వివరాలు తెలుసుకునేందుకు కేజ్రీవాల్‌ మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేశారు.