నన్ను తప్పుగా  అర్థం చేసుకున్నరు

నన్ను తప్పుగా  అర్థం చేసుకున్నరు

ప్రేమ కోసం అడవి బాట పట్టిన వెన్నెలగా ‘విరాటపర్వం’లో ఆకట్టుకున్న సాయిపల్లవి, నెల తిరక్కముందే న్యాయం కోసం కోర్టు మెట్లెక్కే ‘గార్గి’గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. గౌతమ్ రామచంద్రన్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ నెల 15న విడుదలవుతున్న సందర్భంగా సాయిపల్లవి ఇలా ముచ్చటించింది. ‘‘రియలిస్టిక్‌‌ ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా రాసిన ఫిక్షన్‌‌ స్టోరీ ఇది. ఫిదా, విరాటపర్వం చిత్రాల తరహాలోనే ఇందులోనూ తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషన్‌‌ ఆకట్టుకుంటుంది. అయితే చూపించే విధానం డిఫరెంట్‌‌గా ఉంటుంది. తండ్రి దూరంగా ఉన్నప్పుడు కూతురు పడే ఆవేదనని ఇందులో చూస్తారు. తన భర్త ప్రాణం కోసం యమధర్మరాజుతో సావిత్రి పోరాడినట్టు, జైలుపాలైన తండ్రి కోసం న్యాయ పోరాటం చేసే కూతురి కథ. టీచర్‌‌‌‌ పాత్ర నాది. ఇప్పటికిప్పుడు క్లాస్‌‌ రూమ్‌‌లోకి వెళ్తే టీచర్ ఎలా ఉంటుందో అంత నేచురల్‌‌గా ఉండే క్యారెక్టర్. ప్రత్యేకమైన హంగులేవీ ఆ పాత్రలో ఉండవు. అమ్మా నాన్నా సలహాలిస్తేనే మనకి బోర్ కొడుతుంది. సినిమా అయినా అంతే. అందుకే ఏదో మెసేజ్ ఇవ్వాలని తీయలేదు.

దీన్ని ఒక సినిమాగానే చూడాలి. అప్పుడే ఆ ఇన్సిడెంట్స్ మన మెదడులో ఒక కొత్త థాట్ ప్రాసెస్‌‌ని క్రియేట్ చేస్తాయి. ఏ ఒక్క వ్యవస్థనో, వ్యక్తుల్నో తప్పుగా చూపించలేదు. తన తండ్రిని కేసు నుంచి బయటకు తెచ్చే ప్రయత్నంలో ఓ సాధారణ మహిళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురయ్యాయనేది చూపించామంతే. సినిమా చాలా నచ్చడంతో తమిళ వెర్షన్‌‌కి ప్రెజెంటర్‌‌‌‌ అయ్యారు హీరో సూర్య.  జ్యోతిక గారికి కూడా నచ్చి యాడ్ అయ్యారు. ఉదయనిధి స్టాలిన్ మూవీ చూసి ప్రమోషన్స్‌‌లో సపోర్ట్‌‌ చేస్తున్నారు. తెలుగులో రానా ప్రెజెంట్ చేస్తున్నారు. నేను ఫోన్ చేసినప్పుడు నాపై నమ్మకంతో కాల్‌‌ కంప్లీటయ్యేలోపే ఓకే చెప్పేశారు. ‘విరాటపర్వం’ క్లైమాక్స్‌‌లో నా పాత్ర చనిపోయిందని ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యుంటే యాక్టర్‌‌‌‌గా నాకు సంతోషం. అంత ఫీలవుతున్నారంటే ఆ పాత్ర అంతగా కనెక్ట్ అయినట్టేగా! క్యారెక్టర్‌‌‌‌ని సెలెక్ట్‌‌ చేసుకోగలం తప్ప రిజల్ట్‌‌ని ఊహించలేం కదా.  నేనెప్పుడూ ఏ ఎక్స్‌‌పెక్టేషన్‌‌తో ఉండను. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న నలుగురిలోనే ఒక్కొక్కరూ ఒక్కోలా సినిమాని ఎంజాయ్ చేస్తారు. మరి అన్ని వర్గాల వారికీ ఒకేలా రీచ్ అవ్వడం సాధ్యం కాదు కదా. మనం మంచి పని చేసి ప్రేక్షకుల ముందుంచాలి. ఆ తర్వాత వాళ్లే సక్సెస్‌‌ని డిసైడ్ చేస్తారు. ‘లవ్‌‌ స్టోరీ’లో ఎక్కువ డ్యాన్స్ చేయడంతో కొన్నాళ్ల వరకు నో డ్యాన్స్ అనుకున్నా. ఇప్పుడు డ్యాన్స్‌‌ని మిస్సవుతున్నాననిపిస్తోంది. నెక్స్ట్ మూవీలో కచ్చితంగా డ్యాన్స్ సీక్వెన్స్ ఉండేలా చూసుకుంటా. ‘విరాటపర్వం’ ప్రమోషన్‌‌ టైమ్‌‌లో నేను చేసిన కామెంట్స్‌‌పై ఎలాంటి రిగ్రెట్స్ లేవు నాకు. ఎందుకంటే నేను మాట్లాడింది ఒకటైతే, బైటికి వెళ్లింది మరొకటి. కాకపోతే తప్పుగా అర్థం చేసుకున్నారే అనే బాధ మాత్రం ఉంది. నేను పొలిటికల్‌‌గా ఎలాంటి కామెంట్స్ చేయలేదే, ఎందుకిలా అయ్యింది అని ఫీలయ్యాను.’’