- గంగదేవిపాడు గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట - ముచ్చట
ఖమ్మం జిల్లా: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదే ఉంటుందని.. నిరుద్యోగుల కోసం మొదటి సంతకం చేస్తానని.. అలాగే వ్యవసాయాన్ని పండుగలా చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. సత్తుపల్లి నియోజక వర్గం పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట - ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణ అంతా సమస్యలే కనిపిస్తున్నాయని.. ఎవరిని కదిలించినా సమస్యలు చెప్తున్నారని అన్నారు.
కేసీఆర్ మోసాలు పాదయాత్రలో బయటపడుతున్నాయి
ప్రజలకు కేసీఆర్ చేసిన మోసాలు అన్నీ పాదయాత్రలో బయటపడుతున్నాయని, ఇచ్చిన హామీలన్నీ మోసాలే, ఏ ఒక హామీ కూడా నెరవేర్చడం లో కేసీఆర్ కి చిత్తశుద్ది లేదని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికలప్పుడు ఇస్తున్న బోగస్ హామీలను చూసి మనం గంగిరెద్దు లా తల ఊపుతున్నం.. కేసీఆర్ మాత్రం ఎలక్షన్ దాటితే మళ్లీ కనపడడు.. 8 ఏళ్ల తెలంగాణలో ఎవరు బాగుపడ్డారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం, ఆయన పార్టీ నేతల కుటుంబాలు తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శించారు.
బంగారు తెలంగాణ లో కేసీఆర్ ప్రాణాలకు మాత్రమే విలువ, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు.. వ్యవసాయం లాభసాటి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే లెక్క లేదన్నారు. ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పి ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తారా ? పెద్ద కొడుకు అయితే ఇంట్లో అన్నం ఒకరికే పెడతారా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టింది సంక్షేమం కోసం, వైఎస్సార్ పేరు నిలబెట్టేందుకు పార్టీ పెట్టామని వివరించారు. వైఎస్సార్ తెలంగాణ ప్రజలకు కొత్త కాదని, తమ పార్టీ లో వైఎస్సార్ బొమ్మ ఉంది, పార్టీ లో వైఎస్సార్ పేరు ఉందని వివరించారు. తాను కౌలు రైతుల సంక్షేమం కోసం పని చేస్తానని, ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు ఇస్తానని, ఇంట్లో అందరికీ పెన్షన్, ఆరోగ్య శ్రీ.. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాలను మళ్లీ అమలు చేస్తానని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
నిఖత్ జరీన్, ఈషా సింగ్కు సర్కార్ భారీ నజరానా
చైనాలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు
