నిఖత్ జరీన్, ఈషా సింగ్కు సర్కార్ భారీ నజరానా

నిఖత్ జరీన్, ఈషా సింగ్కు సర్కార్ భారీ నజరానా
  • 2 కోట్ల చొప్పున నగదు నజరానా, సిటీలో ఇంటి స్థలం
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈమేరకు ఇటీవల టర్కీ రాజధాని ఇఫ్తాంబుల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో  గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ కు అలాగే జర్మనీలో జరిగిన  ఐఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్ లకు ఒక్కొక్కరికి రూ 2 కోట్ల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో  నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ ఘనత సాధించిన తెలంగాణ బాక్సర్ గా రికార్డు సృష్టించిన ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్ ఇస్తాంబుల్‌ వేదికగా జరిగిన 52 కేజీల కేటగిరీ ఫైనల్లో  నిఖత్‌ 5–0తో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిట్‌పాంగ్‌ జుటామస్‌ను ఓడించి బంగారు పతకం కైవసం చేసుకుంది. ప్రపంచ వేదికపై తన పవర్ పంచ్ తో చరిత్ర సృష్టించిన  నిఖత్ జరీన్ అసమాన ప్రతిభతో  మన దేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. తెలంగాణ నుంచి వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచిన తొలి క్రీడాకారిణిగా.. ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన ఐదో బాక్సర్‌గా చరిత్రకెక్కిన నిఖత్ జరీన్ లెజెండరీ బాక్సర్లు మేరీకోమ్‌, సరితా దేవి తదితరుల సరసన చేరింది. ఇందూరు గడ్డపై సాధారణ ముస్లిం కుటుంబంలో పుట్టి.. భాగ్యనగరంలో బాక్సర్‌గా ఎదిగిన నిఖత్‌ తెలంగాణ బంగారు కొండ..  పాతికేళ్లకే బాక్సింగ్‌ ప్రపంచాన్ని గెలిచిన సిసలైన విశ్వవిజేతగా అవతరించడం గర్వకారణంగా పేర్కొంటూ నగదు నజరానాతోపాటు సిటీలో ఇంటి స్థలం ఇవ్వనుంది. 

 

ఇవి కూడా చదవండి

చైనాలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

పోడు భూములకు పట్టాలిచ్చాకే హరితహారం చేపట్టాలి