కేసీఆర్ ఆదేశిస్తే..బాయిలోనైనా దూకుతా: మల్లారెడ్డి

కేసీఆర్ ఆదేశిస్తే..బాయిలోనైనా దూకుతా: మల్లారెడ్డి
  • కేసీఆర్ ఆదేశిస్తే..బాయిలోనైనా దూకుతా
  • కౌన్సిలర్లను దుబాయి, గోవా తీసుకెళ్లి కూల్ చేసిన
  • అవిశ్వాస నోటీసులు కొత్తేమీ కాదు: మల్లారెడ్డి

హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి ఎంపీ టికెట్ తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరడం లేదని, కేసీఆర్ ఆదేశిస్తే తానే ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బావిలో దూకాలని కేసీఆర్ ఆదేశించినా.. దూకేందుకు కూడా రెడీగా ఉన్నా అని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాస నోటీసులు కొత్తమీ కాదన్నారు. అక్కడక్కడ సమస్యలున్నాయని, అందుకే కౌన్సిలర్లు, కార్పొరేటర్లను దుబాయి, గోవాకు టూర్​కు తీసుకెళ్లి కూల్ చేసే ప్రయత్నం చేశానని తెలిపారు. ఆదివారం తెలంగాణభవన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్లు, చైర్మన్లపై కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీసులు ఇచ్చారని, అందుకే వాళ్లని చిల్ చేసేందుకు విహార యాత్రకు తీసుకెళ్లినట్టు చెప్పారు.

 ‘‘గోవాలో మూడు బీచ్​లు ఉన్నయ్.. కాశీలో ఏమున్నయ్.. అక్కడికి తీసుకుపోతే ఏముంటది? కొందరికి మేయర్, చైర్మన్ పదవులపై ఆశలు ఉంటాయి. అందుకే అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన్రు. బీఆర్ఎస్​ను వంద మీటర్ల లోపల బొంద పెట్టుడు కాదు.. కాంగ్రెస్ పార్టీనే వెయ్యి మీటర్ల లోపల ఉన్నది’’అని మల్లారెడ్డి విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉందో చూసుకోవాలన్నారు. కేసీఆర్ మహాత్ముడని, సీఎంగా ప్రజలకు సేవ చేసినా.. ఉండేందుకు ఇల్లు కట్టుకోలేదన్నారు.

పులి బయటకు వస్తది.. అప్పుడు ఆట మొదలైతది

త్వరలోనే పులి (కేసీఆర్) బయటకు వస్తదని.. అప్పుడు ఆట మొదలవుతదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్కాజిగిరి గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని చెప్పారు. శంభీపూర్ రాజు కృషితోనే మల్కాజిగిరి లోక్​సభ నియోజకవర్గంలో ఉన్న ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచామన్నారు. ప్రజలు మర్చిపోయి కాంగ్రెస్​పార్టీకి ఓటేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయదని, కేసీఆర్ లాంటి నాయకుడు దేశంలోనే లేరన్నారు. 

కాంగ్రెస్ అంటేనే దరిద్రమని, బీఆర్ఎస్ అంటే గొప్ప నమ్మకం అని చెప్పారు. ‘‘కాంగ్రెసోళ్లు గెలవగానే ఎగిరెగిరిపడ్తున్నరు. వాళ్లకు ముందుంది ముసళ్ల పండుగ. మోదీ ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కేసీఆర్​ది త్యాగాల చరిత్ర. ఈ ఓటమి పెద్ద లెక్కలోకి రాదు’’అని మల్లారెడ్డి అన్నారు.