హైదరాబాద్: రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 2026, మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవమానాలు భరిస్తూ తాను ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని తేల్చి చెప్పారు. రాజీనామా తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఈ మేరకు రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ ఆదివారం (మార్చి 22) లేఖ విడుదల చేశారు.
‘‘నాలుగు దశాబ్దాలకుపైగా నాతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు.. గత 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను మీరు గమనిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇంకనూ అవమానాలకు గురి అవుతూ, మానసిక క్షోభతో, కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యంకాని పరిస్థితులలో 2026, మార్చి 25 రోజున భవిష్యత్ ప్రణాళిక కోసం జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్డు బండారి గార్డెన్లో ఉదయం 10:00 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, మీ సలహాలు, సూచనలతో, భవిష్యత్, రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, అందదండలతో, వాకు మానసిక స్థైర్యం కలిగిస్తు, మార్గదర్శకం కాగలరని మనవి’’ అని లేఖలో పేర్కొన్నారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు పార్టీ, ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో జీవన్ రెడ్డి అలకబూనారు. ఈ పరిణామాలతో ఆయన పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు.
దీంతో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఈ మేరకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ వీడొద్దని.. అధిష్టానంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని జీవన్ రెడ్డికి చెప్పారు. కానీ పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో జీవన్ రెడ్డి మాత్రం మనసు మార్చకోలేదు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
►ALSO READ | సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫాక్టరీ ప్రారంభించిన సీఎం రేవంత్
