నా బహిష్కరణకు గెలుపుతో జవాబిస్తా: మహువా మొయిత్రా

నా బహిష్కరణకు గెలుపుతో జవాబిస్తా: మహువా మొయిత్రా

కోల్​కతా: లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా నగర్ ఎంపీగా గెలుపే పార్లమెంట్​లో తన బహిష్కరణకు జవాబని ఆమె తెలిపారు. క్యాష్ ఫర్ క్వారీ కేసులో భాగంగా గతేడాది లోక్ సభ నుంచి మహువా మొయిత్రా బహిష్కరణకు గురయ్యారు. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఆమెను మరోసారి కృష్ణా నగర్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపింది. మంగళవారం మహువా మొయిత్రా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. “నా విజయంపై సందేహం అక్కర్లేదు. మెజార్టీ ఎంతన్నదే ప్రశ్న. అది జూన్ 4న తేలుతుంది. గత ఐదేండ్లుగా ఇక్కడే ఉంటున్నా.

గతంలో ఎమ్మెల్యేగా కూడా ఇక్కడి ప్రజల మధ్య ఉన్నా. అందువల్ల నాకు చాలా బలమైన నెట్ వర్క్ ఉంది. నన్ను బహిష్కరించి, నా ప్రతిష్టను దిగజార్చినందుకు ఈ ఎన్నికల్లో విజయంతో జవాబిస్తా. దేశంలోని ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ, ఇండియా అనేది గొప్ప దేశం. ఫాసిస్టులు దీనిని నాశనం చేయలేరు. భారత్ అనేది నా కర్మభూమి, ధర్మభూమి ప్రజలు నాకు 100% మద్దతు ఇస్తారు’’ అని ఆమె పేర్కొన్నారు.