ఏపీ నుంచి మళ్లీ తెలంగాణకు ఐఏఎస్ ఆమ్రపాలి

ఏపీ నుంచి మళ్లీ తెలంగాణకు ఐఏఎస్ ఆమ్రపాలి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్‌‌‌‌లో చేరిన ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్ కాట ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌‌‌‌ (క్యాట్‌‌‌‌)లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణలో పని చేసిన ఆమె, డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పర్సనల్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ (డీఓపీటీ) ఉత్తర్వులతో నాలుగు నెలల కింద ఏపీకి వెళ్లారు. అయితే, డీవోపీటీ ఆదేశాలను సవాల్‌‌‌‌ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని ఆమె క్యాట్‌‌‌‌లో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. పిటిషన్‌‌‌‌ను అనుమతించిన క్యాట్‌‌‌‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో ఏపీ, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలనూ తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌‌‌‌ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో రిపోర్టు చేశారు. అయితే తాజాగా ఆమ్రపాలి అభ్యర్థనను పరిశీలించిన క్యాట్​మళ్లీ తెలంగాణకు కేటాయించింది.