హ్యాండ్‌‌‌‌‌‌‌‌షేక్‌‌‌‌‌‌‌‌ చేసేసింది!..ఇండియా-పాక్ మధ్య ముదిరిన షేక్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్ వివాదం

హ్యాండ్‌‌‌‌‌‌‌‌షేక్‌‌‌‌‌‌‌‌ చేసేసింది!..ఇండియా-పాక్ మధ్య ముదిరిన షేక్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్ వివాదం
  • మ్యాచ్ రిఫరీని తొలగించాలంటూ ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు 
  • లేదంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరిక!

దుబాయ్‌‌‌‌:  ఆసియా కప్‌‌‌‌లో ఇండియా–పాకిస్తాన్ జట్ల మధ్య చెలరేగిన షేక్‌‌‌‌ హ్యాండ్ వివాదం ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌నే కుదిపేసేలా మారింది. ఈ పోరుకు  మ్యాచ్ రిఫరీగా పని చేసిన ఆండీ పైక్రాఫ్ట్‌‌‌‌ను టోర్నమెంట్ ప్యానెల్ నుంచి తొలగించకపోతే ఆసియా కప్ నుంచి వైదొలగడానికి కూడా వెనుకాడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్‌‌‌‌సిన్ నఖ్వీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌‌‌‌లో  పరిణామాలు రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. టాస్ టైమ్‌‌‌‌లో ఇండియా కెప్టెన్‌‌‌‌ సూర్యకుమార్ యాదవ్, పాక్ సారథి సల్మాన్ అలీ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.  

విన్నింగ్‌‌‌‌ సిక్స్ కొట్టిన వెంటనే సూర్య నాన్‌‌‌‌ స్ట్రయికింగ్ ఎండ్‌‌‌‌లో ఉన్న శివం దూబేకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చి నేరుగా డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌కు వెళ్లిపోయాడు. ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తారని పాక్ ఆటగాళ్లు కాసేపు గ్రౌండ్‌‌‌‌లోనే వేచి చూసి వెళ్లిపోయారు. ఇండియా ఆటగాళ్ల ప్రవర్తన, మ్యాచ్ రిఫరీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పీసీబీ ఈ వివాదంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది.  ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌కు షేక్‌‌‌‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌‌‌‌ సల్మాన్ ఆగాకు చెప్పిన  పైక్రాఫ్ట్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని, క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ  అతడిని తక్షణమే టోర్నమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.  బుధవారం యూఏఈతో జరగబోయే పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌‌‌‌కు కూడా ఆండీ పైక్రాఫ్ట్‌‌‌‌నే రిఫరీగా ఉండటంతో పీసీబీ గుర్రుగా ఉంది. తమ డిమాండ్‌‌‌‌ను అంగీకరించని పక్షంలో యూఏఈతో మ్యాచ్‌‌‌‌ ఆడకుండా టోర్నీ నుంచి తప్పుకోవడమే తమ ముందున్న మార్గమని పీసీబీ హెచ్చరించినట్టు తెలుస్తోంది.  
 
రిఫరీ తప్పిదంతోనే రచ్చ!

పాక్ ప్లేయర్లతో షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ చేయకూడదని ఇండియా నిర్ణయించుకున్నట్టు ఏసీసీ వర్గాల నుంచి ముందుగానే మ్యాచ్ రిఫరీ  పైక్రాఫ్ట్ తెలిసినట్టు సమాచారం. దాంతో టాస్ టైమ్‌‌‌‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగాకు పైక్రాఫ్ట్‌‌‌‌  ఇండియా నిర్ణయం గురించి సమాచారం ఇచ్చాడు. దీంతో ఇరు కెప్టెన్లు టాస్ వద్ద కరచాలనం చేసుకోలేదు. అయితే, మ్యాచ్ ముగిశాక కూడా ఇదే ప్రోటోకాల్ కొనసాగుతుందని చెప్పడం రిఫరీ మరిచిపోయాడని ఏసీసీ వర్గాలు తెలిపాయి. దీంతో ఛేజింగ్ పూర్తి చేసిన వెంటనే ఇండియా ప్లేయర్లు ఎవరితోనూ చేయి కలపకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌కు వెళ్లిపోయారు. ఇది చూసి పాక్‌‌‌‌ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. పాక్‌‌‌‌ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వద్దకు స్నేహపూర్వకంగా మాట్లాడేందుకు వెళ్లగా తన ముఖం మీదే తలుపులు వేసినట్టు తెలుస్తోంది.  ‘మేము షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారి కోసం ఎదురుచూశాం, కానీ వాళ్లు అప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌కు వెళ్లిపోయారు. మ్యాచ్ ఇలా ముగియడం చాలా నిరాశ కలిగించింది’ అని హెస్సన్‌‌‌‌ అన్నాడు. టీమిండియా ప్రవర్తనకు నిరసనగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ  పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని బహిష్కరించాడు.

ఇకపైనా చేయి కలిపేది లేదు

ఈ టోర్నీలో పాక్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌కు ముందు టీమిండియా స్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. పహల్గాం  ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌‌‌‌తో క్రికెట్ ఆడటంపై దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ మార్గనిర్దేశంలో  ఆటగాళ్లు, టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ అంతా కలిసి ఈ టోర్నీలో నో హ్యాండ్‌‌‌‌షేక్ విధానాన్ని అనుసరించాలని తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. టోర్నీలో జరిగే మిగతా మ్యాచ్‌‌‌‌ల్లోనూ ప్రత్యర్థి ఆటగాళ్లతో చేతులు కలపకూడదని నిర్ణయించారు. మ్యాచ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయాలన్న నిబంధన ఏదీ రూల్‌‌‌‌ బుక్‌‌‌‌లో లేదని బీసీసీఐ అధికారి ఒకరు వాదిస్తున్నారు. 

ఐసీసీ కోర్టులో బాల్‌‌‌‌

ఈ వివాదం ఇప్పుడు రెండు క్రికెట్ బోర్డులే కాకుండా ఏసీసీ, ఐసీసీ మధ్య కూడా అగ్గి రాజేసినట్టయింది. పీసీబీ ఫిర్యాదును స్వీకరించిన ఐసీసీకి చైర్మన్‌‌‌‌గా బీసీసీఐ మాజీ సెక్రటరీ జై షా ఉండగా.. టోర్నమెంట్ ఆర్గనైజర్ అయిన ఏసీసీకి  ప్రెసిడెంట్‌‌‌‌గా పీసీబీ చీఫ్ నఖ్వీ కొనసాగుతున్నాడు . పీసీబీ ఫిర్యాదు మేరకు  పైక్రాఫ్ట్‌‌‌‌ను తొలగిస్తే, టీమిండియా వాదనను తోసిపుచ్చినట్లు అవుతుంది. తొలగించకపోతే పాక్‌‌‌‌ టోర్నీ నుంచి వైదొలిగే ప్రమాదం ఉంది. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక, సూపర్‌‌‌‌–-4 దశకు అర్హత సాధించాలంటే పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌‌‌‌లో యూఏఈపై తప్పక గెలవాలి. ఒకవేళ పాక్‌‌‌‌ ముందంజ వేస్తే ఆదివారం  దుబాయ్‌‌‌‌లో ఇండియా‌‌‌‌తో మరోసారి తలపడే అవకాశం ఉంది. 

నో చెప్పడం కొత్తేం కాదు 

రాజకీయ కారణాల వల్ల కరచాలనం నిరాకరించడం క్రీడా ప్రపంచంలో కొత్తేం కాదు. తమ దేశంపై రష్యా దాడికి నిరసనగా 2023 వింబుల్డన్ లో ఉక్రెయిన్ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ స్టార్ ఎలినా స్వితోలినా, రష్యాతో పాటు బెలారస్ దేశాలకు చెందిన ప్లేయర్లకు షేక్‌‌‌‌‌‌‌‌హ్యాండ్ ఇవ్వనని స్పష్టం చేసింది. బెలారస్‌‌‌‌‌‌‌‌కు చెందిన విక్టోరియా అజరెంకాతో ఆమె కరచాలనం చేయలేదు. ఈ ఘటనపై వింబుల్డన్ అధికారులు ఆమెకు ఎలాంటి జరిమానా విధించలేదు.

మా వైఖరి ఇదే: సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ చర్యను సమర్థించుకున్నాడు. పహల్గాం ఉగ్రదాడి బాధితులు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాడు. ‘జీవితంలో కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తి కంటే ముఖ్యమైనవి. ఈ విజయాన్ని పహల్గాం దాడి బాధితులకు, ఆపరేషన్ సింధూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న మన వీర సైనికులకు అంకితమిస్తున్నాం’ అని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ పేర్కొన్నాడు.  హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయం చెప్పాడు. పహల్గాం దాడి బాధితులకు సంఘీభావం తెలపడం, ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైన్యానికి కృతజ్ఞతలు చెప్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.

నఖ్వీ నుంచి కప్పు అందుకుంటారా?

ఈ టోర్నీ సజావుగా సాగి ఇండియా విజేతగా నిలిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అయిన నఖ్వీనే ట్రోఫీ ప్రదానం చేయనున్నాడు. అప్పుడు సూర్యకుమార్ అండ్ కో నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.