టీ20 వరల్డ్ గెలిస్తే కోట్లే...

టీ20 వరల్డ్ గెలిస్తే కోట్లే...

టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు లక్కీ లాటరీ కొట్టనుంది. ట్రోఫీ దక్కించుకున్న టీమ్కు భారీగా ప్రైజ్మనీ దక్కనుంది. నవంబర్ 13న మెల్బోర్న్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచిన జట్టు 1.6 మిలియన్ డాలర్లు అందుకోనుంది. భారత కరెన్సీలో రూ. 13.05కోట్లు. ఈ మేరకు టీ20 వరల్డ్ కప్ ప్రైజ్మనీ వివరాలను ఐసీసీ వెల్లడించింది. 

మొత్తం ప్రైజ్ మనీ రూ.45.67 కోట్లు..
టీ20 వరల్డ్ కప్లో గెలిచిన జట్టు 1.6మిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో  రూ. 13.05కోట్లు అందుకోనుండగా...రన్నరప్కు 8లక్షల డాలర్లు అంటే రూ.6.52 కోట్లు దక్కనున్నాయి.  సెమీ ఫైనల్లో ఓడిన జట్లకు  చెరో 4 లక్షల డాలర్లు అంటే రూ. 3.26కోట్ల చొప్పున అందనున్నాయి. మొత్తంగా  టోర్నీలో అన్ని జట్లకు కలిపి 5.6 మిలియన్ల భారీ ప్రైజ్మనీ అందనుంది. ఇది భారత కరెన్సీలో రూ. 45.67 కోట్ల రూపాయలు. 

సూపర్12లో ఓడితే..రూ.57.09 లక్షలు
సూపర్ 12లో ఓడిన జట్టుకు 70 వేల డాలర్ల ప్రైజ్ మనీ దక్కనుంది. అంటే భారత కరెన్సీలో రూ. 57.09 లక్షలు.  సూపర్ 12లో  రెండు గ్రూపుల నుంచి 6 జట్ల చొప్పున  ఉంటాయి.  అందులో  పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు వెళ్తాయి. దీంతో మిగిలిన నాలుగు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. ఇలా రెండు గ్రూపుల నుంచి మొత్తం ఎనిమిది జట్లు సూపర్ 12దశలో ఇంటిముఖం పడతాయి. వీటికి రూ. 57.09 లక్షలు ఐసీసీ ఇవ్వనుంది.

ఫస్ట్ రౌండ్లో గెలిస్తే..
మొదటి రౌండ్లో  8 జట్లు  రెండు గ్రూపులుగా విడిపోయి ఆడతాయి.  ప్రతి గ్రూపులో టాప్ 2లో నిలిచిన రెండు జట్లు సూపర్ 12దశకు వెళ్తాయి. ఈ రౌండ్లో నాలుగు జట్లు ఓడిపోతాయి. అలా ఓడిన జట్టుకు  రూ.32.62లక్షల ప్రైజ్ మనీ అందనుంది. 

గ్రూప్ స్టేజ్లో ఏ ఏ జట్లు..
అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది.  మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి.  ఫస్ట్ రౌండ్, సూపర్ 12 రౌండ్, సెమీఫైనల్స్, ఫైనల్స్ అనే ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఇక క్వాలిఫైయింగ్ రౌండ్లో   గ్రూప్ A లో  నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  ఉండగా..గ్రూప్ Bలో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఉన్నాయి. ఇకపోతే సూపర్ 12 దశలో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి.  గ్రూప్ Aలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, రౌండ్ 1 క్వాలిఫై అయిన రెండు జట్లు ఉంటాయి. గ్రూప్ Bలో భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, రౌండ్ 1లో క్వాలిఫై అయిన రెండు జట్లు ఉండనున్నాయి.