తొలి వన్డే ఫీజులో టీమిండియా ఆటగాళ్లకు 80 శాతం కోత

తొలి వన్డే ఫీజులో టీమిండియా ఆటగాళ్లకు 80 శాతం కోత

బంగ్లా చేతిలో తొలి వన్డేలో ఓడిన టీమిండియాకు ఐసీసీ షాకిచ్చింది. ఫస్ట్ వన్డేలో స్లోవర్ రేటు కారణంగా భారత జట్టుపై  ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే ఒక్క ఓవర్‌కు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా 4 ఓవర్లు తక్కువగా వేయడంతో 80 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 

అంగీకరించిన రోహిత్..

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ ప్రకారం స్లో ఓవర్ రేటు చేసిన ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్‌, అలాగే జట్టుతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఒక్కో ఓవర్‌కి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తారు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు తక్కువ వేసిన కారణంగా వీరందరికి మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధిస్తారు. మరోవైపు స్లో ఓవర్ రేటు‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించారు. మ్యాచ్ రిఫరీకి క్షమాపణలు చెప్పడంతో పాటు మ్యాచ్ ఫీజు కోతకు అంగీకరించాడు.

దారుణ ఓటమి..

తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది.  కేఎల్‌ రాహుల్‌ 73 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 27 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 24 పరుగులు సాధించారు. బంగ్లా బౌలర్లలో  షకీబ్‌ అల్ హసన్ 5 వికెట్లు,  ఎబాదత్‌ హుస్సేన్‌ 4 వికెట్లు పడగొట్టారు. 187 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా... 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లిటన్‌ దాస్‌ 41 పరుగులు చేశాడు. చివర్లో మెహదీ హసన్‌ మిరాజ్‌ 38 పరుగులతో  నాటౌట్‌ గా నిలిచి జట్టును గెలిపించాడు.  భారత బౌలర్లలో సిరాజ్‌ 3 వికెట్లు,  వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు పడగొట్టారు.