ఐసీసీ కొత్త ఫైనాన్స్ మోడల్ ...బీసీసీఐకి వేల కోట్లు

ఐసీసీ కొత్త  ఫైనాన్స్ మోడల్ ...బీసీసీఐకి వేల కోట్లు

ఐసీసీ కొత్త ఫైనాన్స్ మోడల్ తో ..బీసీసీఐకి కనక వర్షం కురవనుంది. 2024లో ప్రారంభమయ్యే  ఐసీసీ సైకిల్ లో ప్రతీ ఏడాది బీసీసీఐకి రూ. 1889 వేల కోట్ల ఆదాయం అందనుంది. ఈ సైకిల్ లో భాగంగా ఐసీసీ ప్రతీ ఏడాది రూ. 4925 కోట్లు అర్జించనుంది. ఇందులో బీసీసీఐకి రూ. 1889 కోట్లు ఐసీసీ ముట్టచెప్పనుంది. అంటే రూ. 4925 కోట్ల సంపాదనలో 38.5 శాతం వాటా బీసీసీఐ ఖజానాలో చేరనుంది. 

2024 -2027కు సంబంధించి ఐసీసీ ఫైనాన్స్ మోడల్ ను విడుదల చేసింది. ఐసీసీలో బిగ్ త్రీగా చెప్పుకునే బీసీసీఐ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులకు ఐసీసీ సంపాదనలో అధిక ఆదాయం అందుతోంది.  ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB), క్రికెట్ ఆస్ట్రేలియా (CA) కంటే బీసీసీఐకి 38.5 శాతం వాటా అందనుంది. బీసీసీఐ తర్వాత ఇంగ్లాండ్ రూ. 339 కోట్లకు పైగా దక్కించుకోనుంది. ఆ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా రూ. 308  కోట్లకు పైగా ఆదాయం అందుకోనుంది. 

భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్  బోర్డుల తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అత్యధిక ఆదాయాన్ని పొందనుంది. పాకిస్తాన్  దాదాపు రూ. 283 కోట్లు సంపాదిస్తుంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయం కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 7 రెట్లు ఎక్కువ కావడం విశేషం. మరోవైపు ఐసీసీ ఈ నాలుగేళ్లలో  మీడియా హక్కుల రూపంలోనే  దాదాపు రూ. 263 కోట్లు సంపాదిస్తుందని తెలుస్తోంది. వీటిలో అధిక భాగం భారత మార్కెట్ల నుంచే వస్తుంది. ఈ నాలుగేళ్ల ఐసీసీ సైకిల్‌కు డిస్నీ స్టార్ ఏకంగా రూ. 246 కోట్లు చెల్లించింది.

కొత్త ఫైనాన్స్ మోడల్ పై అన్ని దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఐసీసీ ఇంకా అభిప్రాయాన్ని తీసుకోలేదు. అన్ని బోర్డుల నుంచి ఏకాభిప్రాయాన్ని పొందిన తర్వాత ఐసీసీ  కొత్త ఆర్థిక నమూనాపై తుది నిర్ణయం తీసుకోనుంది.