దుబాయ్: చాలా రోజుల తర్వాత ఫామ్ అందుకొని న్యూజిలాండ్‌పై వరుసగా రెండు ఫిఫ్టీలతో సత్తా చాటిన ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ముందుకొచ్చాడు. బుధవారం విడుదలైన తాజా జాబితాలో సూర్య ఐదు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్ర స్థానంలో కొనసాగుతుండగా, హైదరాబాదీ తిలక్ వర్మ మూడో స్థానంలో నిలిచాడు.
టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి మెరుపు ఫిఫ్టీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ 64 ర్యాంక్‌తో తిరిగి ర్యాంకింగ్స్‌లోకి రాగా.. శివం దూబే (58), రింకూ సింగ్ (68) కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 4 స్థానాలు మెరుగై 13వ ప్లేస్‌కు చేరుకోగా.. రవి బిష్ణోయ్ 13 ప్లేస్‌లు మెరుగై 19వ ర్యాంక్ అందుకున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు మెరుగుపరుచుకుని 59వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో హార్దిక్ మూడో స్థానంలో నిలిచాడు.
