
- 4 రన్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఇండియా ఓటమి
- సెమీస్‌కు ఇంగ్లిష్ జట్టు అర్హత
- రాణించిన నైట్, అమీ జోన్స్
ఇండోర్: విమెన్స్ వరల్డ్ కప్‌లో ఇండియా సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. రేసులో ముందుకు సాగాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చివర్లో చతికిలపడింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో స్మృతి మంధాన (94 బాల్స్‌లో 8 ఫోర్లతో 88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బాల్స్‌లో 10 ఫోర్లతో 70), దీప్తి శర్మ (57 బాల్స్‌లో 5 ఫోర్లతో 50) పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 రన్స్ స్వల్ప తేడాతో ఇండియాపై గెలిచి సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 288/8 స్కోరు చేసింది. హీథర్ నైట్ (91 బాల్స్‌లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 109) సెంచరీతో చెలరేగింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఇంగ్లండ్‌ను దీప్తి శర్మ (4/51) కట్టడి చేసింది. ఓపెనర్లు ట్యామీ బ్యూమెంట్ (22), అమీ జోన్స్ (56) తొలి 15 ఓవర్లలో 73 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. కానీ 16వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన దీప్తి వరుస విరామాల్లో ఓపెనర్లను పెవిలియన్‌కు పంపింది. దీంతో ఇంగ్లండ్ 98/2తో నిలిచింది. ఈ దశలో హీథర్ నైట్, కెప్టెన్ సివర్ బ్రంట్ (38) అద్భుతంగా ఆడారు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ మూడో వికెట్‌కు 113 రన్స్ జత చేశారు. 39వ ఓవర్‌లో బ్రంట్ ఔటైన తర్వాత ఇంగ్లండ్ లైనప్ కుప్పకూలింది. దీప్తి, శ్రీచరణి (2/68) అద్భుతమైన టర్నింగ్‌తో చకచకా వికెట్లు తీసి స్కోరును అడ్డుకున్నారు.
ఓ ఎండ్‌లో నైట్ సెంచరీతో నిలబడినా.. రెండో ఎండ్‌లో సోఫియా డంక్లీ (15), ఎమ్మా లాంబ్ (11), అలైస్ క్యాప్సీ (2), సోఫీ ఎకెల్‌స్టోన్ (3) నిరాశపర్చారు. 77 రన్స్ తేడాలో ఐదు వికెట్లు పడటంతో ఇంగ్లండ్ స్కోరు 300 దాటలేదు. తర్వాత ఛేజింగ్‌లో ఇండియా 50 ఓవర్లలో 284/6 స్కోరుకే పరిమితమైంది. ప్రతీకా రావల్ (6) ఫెయిలైనా.. మంధాన కీలక భాగస్వామ్యాలు జోడించింది. హర్లీన్ డియోల్ (24)తో రెండో వికెట్‌కు 29, హర్మన్‌ప్రీత్‌తో మూడో వికెట్‌కు 125, దీప్తితో నాలుగో వికెట్‌కు 67 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను సుస్థిరం చేసింది. అయితే 42వ ఓవర్‌లో మంధానా ఔట్‌తో మ్యాచ్ కీలక మలుపు తీసుకుంది. రిచా ఘోష్ (8) నిరాశపర్చగా, అమన్‌జోత్ కౌర్ (18 నాటౌట్), స్నేహ్ రాణా (10 నాటౌట్) చివరి వరకు పోరాడారు. చివరి ఓవర్‌లో 14 రన్స్ అవసరం కాగా అమన్‌జోత్ ఫోర్ కొట్టినా ప్రయోజనం దక్కలేదు. బ్రంట్ రెండు వికెట్లు తీసింది. హీథర్ నైట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.