మహిళా క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ నిలిపివేత

మహిళా క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ నిలిపివేత

దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో ప్రపంచ దేశాలు ఆంక్షలు తీవ్రతరం చేస్తున్నాయి. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిన నేపథ్యంలో  మహిళా క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశమైన జింబాబ్వేలో జరుగుతున్న మహిళా ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లను తక్షణం నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కారణంగా టోర్నీని అర్థాంతరంగా నిలిపేస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. ఈ టోర్నీని మళ్లీ ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉందన్నది ఐసీసీ క్లారిటీ ఇవ్వలేదు. ఈ వైరస్ లక్షణాలు, దాని తీవ్రత, ప్రభావం ఎలా ఉంటుందన్న వివరాలు పూర్తిగా తెలిశాక ప్రపంచ కప్‌ నిర్వహణపై మళ్లీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త వేరియంట్ ప్రభావాన్ని బట్టి టోర్నీ నిర్వహణ ఆధారపడి ఉండనుంది.

మరోవైపు సౌతాఫ్రికాలో జరుగుతున్న నెథర్లాండ్స్ వన్డే సిరీస్‌ టూర్‌‌ను కూడా రద్దు చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఇప్పటికే ఒక మ్యాచ్ పూర్తి కాగా, ఈ నెల 28, డిసెంబర్ 1వ తేదీన మిగిలిన రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు ఇప్పటికే సౌతాఫ్రికాలో నమోదైన నేపథ్యంలో ప్లేయర్ల సేఫ్టీ దృష్ట్యా ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులతో అంగీకారంతో సిరీస్‌ను వాయిదా వేసినట్లు ఐసీసీ తెలిపింది.