
దుబాయ్: ఇండియా బ్యాటర్ దీప్తి శర్మ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో దీప్తి (569) ఏకంగా పది ప్లేస్‌లు ఎగబాకి 23వ ర్యాంక్‌లో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాణించడం దీప్తికి కలిసొచ్చింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (727) టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. జెమీమా రొడ్రిగ్స్ (603) 15వ ర్యాంక్‌లో ఉండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ (581) ఐదు స్థానాలు దిగజారి 21వ ర్యాంక్‌లో నిలిచింది. బౌలింగ్ కేటగిరీలో వరల్డ్ నంబర్‌వన్ సోఫియా ఎకెల్‌స్టోన్ (776) తన టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకుంది.
ఇండియాతో జరిగిన రెండో వన్డేలో ఎకిల్‌స్టోన్ 3 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. దీప్తి శర్మ (655) నాలుగో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. స్పిన్నర్ స్నేహ్ రాణా (515) 12 ర్యాంక్‌లు ఎగబాకి 21వ ప్లేస్‌ను సాధించింది. 515 ఆమె పర్సనల్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు కావడం విశేషం. ఇంగ్లండ్ స్పిన్నర్ చార్లీ డీన్ (625) 9వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. ఇది ఆమె కెరీర్ బెస్ట్ ర్యాంక్. ఆల్‌రౌండర్స్ లిస్ట్‌లో డీన్, ఎలైస్ పెర్రీతో కలిసి సంయుక్తంగా 14వ ర్యాంక్‌ను సాధించింది. ఎకిల్‌స్టోన్ 18వ ర్యాంక్‌లో ఉంది.