
- అర్హత విధానం తేల్చేందుకు వర్కింగ్ గ్రూప్
- ఐసీసీ సీఈసీ సమావేశంలో నిర్ణయం
సింగపూర్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటలో అవసరమైన మార్పులు, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత విధానంతో పాటు ఇతర ముఖ్య సమస్యలపై చర్చించడానికి ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని శుక్రవారం సింగపూర్‌లో జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ) సమావేశంలో నిర్ణయించింది. ఈ వర్కింగ్ గ్రూప్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇందులో సీఈసీ, ఐసీసీ బోర్డు సభ్యులు ఉంటారు. వీరంతా ప్రధానంగా లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు క్రికెట్ జట్లను ఎలా ఎంపిక చేయాలో సిఫార్సులు చేస్తారు. చాలా మంది క్రికెట్ నిపుణులు టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా సెలెక్ట్ చేయాలని సూచిస్తున్నారు. అయితే, ఐసీసీ చైర్మన్ జై షా నేతృత్వంలోని ఐసీసీ ఈ విషయాన్ని వర్కింగ్ గ్రూప్‌కే వదిలేసింది. కొందరు క్వాలిఫయింగ్ టోర్నీలు నిర్వహించాలని ప్రతిపాదించారు. కానీ, టైం తక్కువగా ఉండటం, ఇప్పటికే బిజీగా ఉన్న షెడ్యూల్ (ఎఫ్‌టీపీ) కారణంగా అది కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక చేయాలని సిఫార్సు చేస్తే, ఏ తేదీ నాటికి ర్యాంకింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలో కూడా సూచించాల్సి ఉంటుంది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఆరు (మెన్, విమెన్) జట్లకు మాత్రమే అవకాశం ఉంది.
15 ఏండ్లు ఉంటేనే ఇంటర్నేషనల్ క్రికెట్ ఎంట్రీ
టెస్ట్ క్రికెట్‌ను రెండు విభాగాలుగా (టూ-టైర్ టెస్ట్ స్ట్రక్చర్) విభజించాలనే వివాదాస్పద ప్రతిపాదనను ఈ సమావేశంలో చర్చించలేదు. అయితే, టెస్ట్ క్రికెట్‌లో మార్పులు అవసరమా లేదా అనేది కూడా వర్కింగ్ గ్రూప్ పరిశీలించే అవకాశం ఉంది. అలాగే, వన్డే, టీ20 ఫార్మాట్లలో అవసరమైన మార్పులను కూడా ఈ గ్రూప్ సూచించనుంది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పోటీకి కనీస వయస్సు15 ఏండ్లుగానే ఉంటుందని ఈ సమావేశంలో ఐసీసీ మరోసారి స్పష్టం చేసింది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ రూల్ సడలించడానికి అవకాశం ఉంటుందని సీఈసీ అంగీకరించింది. మరోవైపు అమెరికా క్రికెట్ అసోసియేషన్ భవిష్యత్తుపై ఐసీసీ బోర్డు శనివారం నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల అమెరికాను సందర్శించిన నార్మలైజేషన్ కమిటీ యూఎస్‌ఏసీ మెంబర్లను రాజీనామా చేయమని కోరినట్లు తెలుస్తోంది. కానీ, దీనిపై వారి నుంచి వ్యతిరేకత ఉందని సమాచారం. ఒలింపిక్స్ అమెరికాలో జరగనున్నందున యూఎస్ సంఘంపై నిర్ణయం కీలకం కానుంది.