
- కివీస్‌నూ కొట్టేస్తారా?
- జోరుమీదున్న ఇరుజట్లు
- విజయ్ శంకర్ అరంగేట్రం!
- మ్యాచ్‌కు వాన ముప్పు
- మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
మొన్న సౌతాఫ్రికాను సఫా చేశాం.. నిన్న కంగారూలకు కళ్లెం వేశాం.. ఇప్పుడు న్యూజిలాండ్ వంతు వచ్చింది..! ఐసీసీ ఈవెంట్లలో మిగతా జట్ల విషయాన్ని పక్కనబెడితే.. కివీస్‌పై ఇండియా రికార్డు మాత్రం అంత బాగాలేదు..! చాలా మంది దిగ్గజాలు ప్రయత్నించినా.. మెరుగుపడని ఆ పాత రికార్డును తిరగరాయాలని టీమిండియా గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్టార్ ఓపెనర్ ధవన్ గైర్హాజరీతో ప్లాన్–బిని పరీక్షించుకోవాలని చూస్తున్న విరాట్‌సేనకు ఇది కఠిన పరీక్షే అయినా.. మూడోసారి కప్ కోసం ముందడుగు వేయాలంటే ఇందులో పాస్ కావాల్సిందే..! అయితే ఈ రెండు సవ్యంగా సాగాలంటే ముందు వాన దేవుడు కరుణించాలి..! ఆల్‌రౌండర్లతో బలంగా ఉన్న కివీస్‌ను కొడితే.. రాబోయే మ్యాచ్‌ల్లో విరాట్‌సేనకు ఇక తిరుగుండదనేది వాస్తవం..!
నాటింగ్‌హామ్: వరుసగా రెండు విజయాలు.. స్టార్లందరూ ఫామ్‌లోకి వచ్చారు.. బౌలింగ్‌లోనూ ఇక తిరుగులేదు.. ఎదురుగా ఎలాంటి ప్రత్యర్థి ఉన్నా గెలుపు మనదే అన్న ధీమాలో ఉన్న టీమిండియాకు ధవన్ గాయం ఓ కుదుపు. అప్పటివరకు వేసుకున్న వ్యూహాలు.. సమీకరణాలన్నీ మారడంతో ఇప్పుడు కొత్త కూర్పు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇండియా టీమ్. ఈ నేపథ్యంలో గురువారం జరిగే కీలక పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్‌సేన.. సౌతాఫ్రికా, ఆసీస్‌ను ఓడిస్తే, కివీస్ వరుసగా మూడు విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్నది. దీంతో ఈ మ్యాచ్‌లో
ఫేవరెట్‌ని అంచనా వేయడం కష్టంగా మారింది. అయితే మెగా ఈవెంట్‌కు ముందు న్యూజిలాండ్‌లో పర్యటించిన ఇండియా 4–1తో సిరీస్‌ను గెలుచుకుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశమే అయినా.. వరల్డ్‌కప్ వామప్‌లో ఓడిపోవడం ప్రతికూలం. పేపరు మీద బ్యాటింగ్, బౌలింగ్‌ను పరిశీలిస్తే ఇరుజట్లు దాదాపు సమంగా కనిపిస్తున్నాయి. అయితే ఆల్‌రౌండర్లతో కివీస్ ఓ అడుగు ముందు నిలిస్తే.. హిట్టర్ల బలంతో ఇండియా రెండు అడుగులు పైనే కనిపిస్తున్నది. మొత్తానికి వరుణుడు కరుణిస్తే కివీస్ బౌలింగ్‌కు, టీమిండియా బ్యాటింగ్‌కు రసవత్తర పోరు ఖాయం..!
నాలుగులో ఎవరు?
గత మ్యాచ్‌ల్లో సూపర్ ఫెర్ఫామెన్స్ చూపెట్టిన టీమిండియాకు ధవన్ లేకపోవడం పెద్ద లోటే. దీనిని అధిగమించేందుకు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి కొత్తగా ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తారో చూడాలి. అదే సమయంలో ప్లాన్–బిని పరీక్షించుకునేందుకు ఇదో గొప్ప అవకాశమని కూడా చెప్పొచ్చు. రోహిత్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉండటంతో 4వ స్థానంలో ఎవర్ని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గత రెండు మ్యాచ్‌ల్లో 4వ స్థానంలో ఆడిన రాహుల్ 37 పరుగులే చేశాడు. దీంతో కొత్తగా వచ్చే వారిపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్థానం కోసం ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, అనుభవజ్ఞుడు దినేశ్ కార్తీక్ మధ్య పోటీ ఉంది. అయితే బుధవారం నెట్స్‌లో అందరికంటే ముందుగా శంకర్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో మేనేజ్‌మెంట్ అతనికే ఓటు వేసే అవకాశాలున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ఇద్దర్ని తుది జట్టులోకి తీసుకుంటే మాత్రం కేదార్ జాదవ్‌ను పక్కన పెట్టొచ్చు. కానీ ఈ వ్యూహానికి కోహ్లీ, శాస్త్రి ఒప్పుకోకపోవచ్చు.
ఓపెనింగ్‌లో రాహుల్.. బౌల్ట్, ఫెర్గుసన్‌ను దీటుగా ఎదుర్కొంటే ఇండియా కష్టాలు సగం తీరినట్లే. కానీ ఇదంత సులభం కాకపోవచ్చు. ఓ ఎండ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ ఉంటాడు కాబట్టి.. ఒకవేళ కార్తీక్‌ను ఓపెనర్‌గా ఆడించి.. రాహుల్‌ను నాలుగుకు పరిమితం చేస్తారా? ఏదేమైనా ఓపెనర్‌గా రాహుల్.. రోహిత్‌ను చూసి చాలా నేర్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా మ్యాచ్ ఆడటం, పవర్‌ప్లేలో రిస్క్‌లేని షాట్లు కొట్టడం, మంచి స్ట్రోక్ ప్లే చూపెడితే.. రాబోయే మ్యాచ్‌లో అతనికి తిరుగుండదు. ఎలాగూ కోహ్లీ, ధోనీ, పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉన్నారు కాబట్టి భారీ స్కోరు ఆశించొచ్చు. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా అవకాశం రాని జాదవ్ కూడా తోడైతే కివీస్‌కు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విషయానికొస్తే వాతావరణం మేఘావృతంగా ఉంటే మూడో పేసర్‌గా షమీకి అవకాశం దక్కొచ్చు. అప్పుడు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లో ఒక్కరే ఆడతారు. బుమ్రా, భువనేశ్వర్ కొత్త బంతితో సంచలనాలు చేస్తున్నారు. మ్యాచ్ మధ్యలో ‘కుల్చా’ ద్వయం కూడా చెలరేగిపోతున్నది. కేదార్, పాండ్యా ఐదో బౌలర్ కోటాను పూర్తి చేస్తున్నారు.
ఆల్‌రౌండర్లే బలం..
గత టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న కివీస్.. ఈసారి కప్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికితోడు మూడు విజయాలతో మంచి జోష్‌మీదుంది. నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉండటం కొండంత బలం. ఓపెనింగ్‌లో గప్టిల్, మన్రో విఫలమైనా.. పటిష్టమైన మిడిలార్డర్ పరుగుల వరద పారిస్తున్నది. 2015 వరల్డ్‌కప్ నుంచి కివీస్ ఓపెనర్లు 36.92 సగటుతో 2843 పరుగులే చేశారు. కానీ మిడిల్‌లో విలియమ్సన్, టేలర్ తమ అనుభవాన్ని రంగరిస్తే.. నీషమ్, గ్రాండ్‌హోమ్ హిట్టింగ్‌తో భారీ స్కోరును సాధించిపెడుతున్నారు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉండటం కివీస్‌కు కలిసొచ్చే అంశమే అయినా.. కుల్దీప్, చహల్ స్పిన్‌ను ఎలా ఎదుర్కొంటారన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నది. బౌలింగ్‌లో బౌల్ట్ ట్రంప్‌కార్డు. ఫెర్గుసన్ కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. స్పిన్నర్ శాంట్నర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ధోనీ, పాండ్యా నుంచి ఇతనికి ముప్పు తప్పకపోవచ్చు. ఫీల్డింగ్‌లో ఇండియాతో పోలిస్తే బ్లాక్ క్యాప్స్ ఓ మెట్టు పైనే ఉండటం విశేషం.
జట్లు (అంచనా)
ఇండియా: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, విజయ్ శంకర్ / దినేశ్ కార్తీక్, ధోనీ, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మన్రో / నికోలస్, టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, సౌథీ / హెన్రీ, ఫెర్గుసన్, బౌల్ట్.