ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ నిజామాబాద్ ​ఇన్‌చార్జి పీడీ

ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ నిజామాబాద్ ​ఇన్‌చార్జి పీడీ

ఆర్మూర్, వెలుగు : అతడు కారు ఓనర్​ కమ్​ డ్రైవర్. కొన్నేండ్లుగా నిజామాబాద్​ జిల్లా ఐసీడీఎస్​ఇన్​చార్జి పీడీ, ఆర్మూర్​ సీడీపీఓ కూడా అయిన ఝాన్సీ లక్ష్మి దగ్గర డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఎనిమిది నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో ‘మేడమ్ కిరాయి పైసలొస్తలేవ్..కుటుంబం గడవక ఇబ్బంది పడుతున్నా. దయచేసి​ఇప్పించండి’ అని విన్నవించుకున్నాడు. ఆమె మాత్రం రూ.20 వేలు ఇస్తేనే బిల్లు శాంక్షన్​చేయిస్తానని ఖరాకండిగా చెప్పడంతో కలత చెందాడు. ఇంతకాలం నుంచి నమ్మకంగా పని చేస్తుంటే తననే లంచం అడుగుతుందా అని ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనలతో లంచం ఇస్తుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్​పీ ఆనంద్​కథనం ప్రకారం..మహేందర్​అనే వ్యక్తి  తన కారును పదేండ్ల నుంచి ఆర్మూర్​ ఐసీడీఎస్​ ఆఫీస్ కు కిరాయికి పెట్టాడు. డ్రైవర్​గా కూడా తానే ఉన్నాడు. దీనికి నెలకు రూ.33వేలు ఇవ్వాలనేది ఒప్పందం. ఎనిమిది నెలల నుంచి కిరాయి రాకపోవడంతో ఇన్​చార్జి పీడీ ఝాన్సీని అడగ్గా తనకు డబ్బులిస్తేనే శాంక్షన్ ​చేయిస్తానని చెప్పింది. దీంతో మహేందర్ ​ఏసీబీని ఆశ్రయించి ఝాన్సీకి రూ.12వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. మంగళవారం ఆర్మూర్ ఎంపీడీఓ ఆఫీసులో దివ్యాంగుల ప్రత్యేక శిబిరానికి ఐసీడీఎస్ ఇన్​చార్జి పీడీ ఝాన్సీలక్ష్మి హాజరైంది. శిబిరం నడుస్తుండగా మహేందర్ ​ఫోన్ ​చేసి డబ్బులు తెచ్చానని చెప్పడంతో ఆర్మూర్ ​సీడీపీఓ ఆఫీసుకు వచ్చింది. అక్కడ కంప్యూటర్​ ఆపరేటర్​అర్చన లంచం తీసుకుని ఇన్​చార్జి సీడీపీఓ ఝాన్సీకి ఇస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ ఇన్​స్పెక్టర్లు శ్రీనివాస్, నగేశ్​పాల్గొన్నారు.