- నిమ్స్ విస్తరణపై సర్కార్ ఫోకస్
- ఓపీ సేవల నుంచి సర్జరీల దాకా అన్నింటా వృద్ధి
- ఆ మేరకు గత రెండేండ్లలో భారీగా పెరిగిన ప్రభుత్వ గ్రాంట్లు
- ఒక్క ఏడాదే రూ.122 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు
- కొత్తగా 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- తాజాగా 125 వెంటిలేటర్లు మంజూరు.. రూ. 1,698 కోట్లతో విస్తరణ పనులు
హైదరాబాద్, వెలుగు: పేదల పెద్ద హాస్పిటల్గా గుర్తింపు పొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్సైన్సెస్( నిమ్స్).. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా వైద్యసేవలు అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో కొన్ని విభాగాల్లో ఎయిమ్స్‌ను మించి సేవలు అందిస్తోంది. రోగుల రద్దీకి తగ్గట్టుగా ప్రభుత్వం కేటాయింపులు పెంచుతోంది. గత రెండేండ్ల గణాంకాలు చూస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ నిధులు దాదాపు రెట్టింపు అయ్యాయి. తాజాగా నిమ్స్ లో సేవల విస్తరణ కోసం 850 కొత్త పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది.
నిమ్స్కు నిధుల వెల్లువ..
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిమ్స్ కు నిధులు కేటాయిస్తున్నది. 2022-23లో ప్రభుత్వ గ్రాంట్లు, ఇతరత్రా కలిపి రూ. 256 కోట్లు కేటాయించగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి అది రూ. 323 కోట్లకు చేరింది. ఎక్విప్‌మెంట్ గ్రాంట్ ఏకంగా రూ. 15 కోట్ల నుంచి రూ.36 కోట్లకు పెరగడం విశేషం. ఇక సీఎం సహాయ నిధి ద్వారా వచ్చే ఆదాయం 2022-23లో రూ. 29 కోట్లు ఉంటే.. ఇప్పుడు అది ఏకంగా రూ. 122 కోట్లకుచేరింది. ఆరోగ్యశ్రీ లిమిట్‌ను రూ.10 లక్షలకు పెంచడంతో ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే రెవెన్యూ రూ.66 కోట్ల నుంచి రూ.102 కోట్లకు చేరింది.
ఈ క్రమంలోనే గత రెండేండ్లలో ఇన్‌పేషెంట్లు 36.6%, ఓపీ రోగులు 29.3% పెరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. రెండేండ్ల కింద 24 వేల సర్జరీలు జరిగితే.. ఇప్పుడు ఏకంగా 37,616 సర్జరీలు జరిగాయి. అంటే సర్జరీల్లో ఏకంగా 56% వృద్ధి నమోదైంది. అవయవ మార్పిడిలో నిమ్స్ కి తిరుగులేకుండా పోయింది. కిడ్నీ మార్పిడిలో 1,100 ఆపరేషన్లతో రికార్డు సృష్టించగా.. 90 శాతం ట్రాన్స్‌ప్లాంట్లు పేదలకు ఉచితంగానే (ఆరోగ్యశ్రీ/సీఎంఆర్ఎఫ్ ద్వారా) జరిగాయి.
హైలెవల్ సౌకర్యాలు..
పెరుగుతున్న రోగుల అవసరాల కోసం ప్రభుత్వం తాజాగా 125 కొత్త వెంటిలేటర్లను మంజూరు చేసింది. మరోవైపు రూ.1,698 కోట్లతో చేపట్టిన నిమ్స్ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే డీ-బ్లాక్ లో 95 శాతం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 2026 నాటికి ఈ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వస్తే.. మరో 2 వేల పడకలు అదనంగా చేరనున్నాయి. మరో వైపు వైద్య సేవల్లో నిమ్స్ దేశంలోనే మొదటి స్థానం దిశగా దూసుకెళ్తోంది.
ముఖ్యంగా న్యూరో సర్జరీ విభాగంలో నిమ్స్ పనితీరు అద్భుతంగా ఉందని, ఈ విషయంలో ప్రతిష్టాత్మక ఢిల్లీ ఎయిమ్స్ ను కూడా నిమ్స్ మించిపోయిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. జటిలమైన బ్రెయిన్ సర్జరీలు, స్పైన్ సర్జరీలను విజయవంతంగా చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. రోబోటిక్ సర్జరీల్లోనూ (100 నుంచి 322కు పెంపు) నిమ్స్ తన మార్క్ చూపిస్తోంది.
సిబ్బంది కొరతకు చెక్
నిమ్స్‌లో పెరుగుతున్న పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా డాక్టర్లు, సిబ్బంది లేరన్న విమర్శలకు చెక్ పెడుతూ ప్రభుత్వం భారీ నియామకాలకు తెరలేపింది. అన్ని డిపార్ట్‌మెంట్లను బలోపేతం చేసే దిశగా 850 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఈ నియామకాలు పూర్తయితే రోగులకు మరింత వేగంగా, నాణ్యమైన వైద్యం అందుతుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ విభాగాల్లో సేవల స్థాయి పెరుగుతుంది.
