- బడ్జెట్ పై ఇవాళ్టి ( ఫిబ్రవరి 16 ) నుంచి నుంచి రివ్యూ సమావేశాలు
హైదరాబాద్, వెలుగు: వచ్చే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రివ్యూ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు వారం రోజుల పాటు సాగే ఈ కసరత్తులో ఆయా శాఖల వారీగా నిధుల కేటాయింపులు, వ్యయాలపై సమగ్ర సమీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, ఇతర రుణాల లభ్యతను బేరీజు వేస్తూ బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వాస్తవిక దృక్పథంతో నిధుల కేటాయింపులు జరపాలని డిప్యూటీ సీఎం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
సెక్రటేరియెట్లో జరిగే ఈ సమావేశాలకు అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు తమ నివేదికలతో హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాఖల వారీగా అవసరాలు ఏంటి? గత బడ్జెట్‌లో విడుదల చేసిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారన్న అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమీక్షల్లోనే ఏ శాఖకు ఎంత కేటాయింపులనే దానిపై క్లారిటీ రానుంది. అనంతరం పూర్తి స్థాయి బడ్జెట్ ను రెడీ చేసి కేబినెట్ ఆమోదం అనంతరం.. అసెంబ్లీలో ప్రవేశపెడుతారు. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
దుబారా అరికట్టి.. అర్హులైన లబ్ధిదారులకే పథకాలు
ఏ డిపార్ట్‌మెంట్‌కు ఎంత నిధులు అవసరం? ఏ ప్రాజెక్టులు ప్రాధాన్యక్రమంలో ఉన్నాయి? అనే కోణంలో భట్టి విక్రమార్క రివ్యూ చేయనున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి రంగం, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. ప్రతి శాఖ తమకు గతేడాది కేటాయించిన నిధులు, వాటి వినియోగం, ప్రస్తుత అవసరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించాల్సి ఉంటుంది.
వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేలా రాయితీలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. నిధుల దుబారాను అరికట్టి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని డిప్యూటీ సీఎం సూచించారు. గత బడ్జెట్‌లో ఎదురైన ఇబ్బందులను సరిదిద్ది, ఈసారి నిరంతర నిధుల ప్రవాహం ఉండేలా చూస్తున్నారు. శాఖల వారీగా వచ్చే ఆదాయ మార్గాలను కూడా విశ్లేషించి, సొంత రాబడిని పెంచుకునేందుకు గల అవకాశాలను కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు భారీగా నిధులను కేటాయించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర అప్పుల భారం, వడ్డీల చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటూనే అభివృద్ధి పనులు కుంటుపడకుండా సమతుల్యత పాటించాలని చూడనున్నారు. అన్ని జిల్లాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ అసమానతలు తొలగేలా నిధుల పంపిణీ జరపాలని డిప్యూటీ సీఎం భావిస్తున్నారు.
