నర్సాపూర్ పట్టణంలోని బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఆఫీసర్లు

నర్సాపూర్ పట్టణంలోని బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఆఫీసర్లు

నర్సాపూర్, వెలుగు: పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరుగుతున్న బాల్యవివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. నర్సాపూర్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు అన్నపూర్ణ, స్వప్న, జిల్లా కో ఆర్డినేటర్ గంగాధర్, ఎస్ఐ రంజిత్ కుమార్ కలిసి వివాహాన్ని నిలిపివేశారు. 

వధువు, వరుడు సంగారెడ్డి జిల్లా వాసులు కావడంతో కేసును అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ జిల్లాలోని మండల, గ్రామ, తండాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫంక్షన్ హాల్ యజమానులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ వర్గం, పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు, వధూవరుల వయస్సు నిర్ధారణ చేయాలని సూచించారు. 

అమ్మాయికి 18 ఏండ్లు, అబ్బాయికి 21 ఏండ్లు నిండని పక్షంలో వెంటనే కౌన్సెలింగ్ చేసి వివాహాన్ని ఆపాలన్నారు. వయస్సు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదని బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ చూడాలని తెలిపారు.