ఖాట్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. 8,848.86 మీటర్లు ఎత్తైన ఈ మంచు కొండ అత్యంత వేగంగా కరిగిపోతోందట. ఎవరెస్ట్ పర్వత శ్రేణుల్లో గత 2వేల ఏళ్లలో ఏర్పడిన మంచు కేవలం 25ఏళ్లలోనే కరిగిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మంచు ఏర్పడేందుకు పట్టిన సమయం కన్నా 80రెట్లు వేగంగా కరిగిపోతోందని యూనివర్సిటీ ఆఫ్ మెయిన్ రీసెర్చర్లు గుర్తించారు. ఈ విషయాన్ని నేచర్ జర్నల్ తన రిపోర్టులో వెల్లడించింది.
మౌంట్ ఎవరెస్ట్పై ఉన్న సౌత్ కల్నల్ గ్లేసియర్ అత్యంత వేగంగా కరిగిపోతున్నట్లు పరిశోధనలో తేలింది. సముద్రమట్టానికి 26,000 అడుగుల ఎత్తులో ఎవరెస్ట్ శిఖరాగ్రానికి కేవలం కిలోమీటర్ దిగువన ఈ సౌత్ కల్నల్ గ్లేసియర్ ఉంది. అయితే మంచు వేగంగా కరిగిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని సైంటిస్టులు అంటున్నారు. వాతావరణ మార్పులు, మానవ తాకిడి పెరగడం, పేరుకుపోతున్న వ్యర్థాలు మంచు వేగంగా కరిగేందుకు దోహదపడుతున్నాయని అంటున్నారు. టూరిస్ట్ స్పాట్గా మారిన ఎవరెస్ట్ పై దాదాపు 12వేల కిలోల మానవ వ్యర్థాలు పోగై ఉన్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
ఎవరెస్ట్ శిఖరంపై మంచు ఇదే వేగంతో కరిగిపోతే పెను ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నరు. గ్లేసియర్లు కరిగిపోవడం వల్ల హిమాలయ పాదాల వద్ద వందల సంఖ్యలో సరస్సులు ఏర్పడ్డాయి. మంచు ఇదే వేగంతో కరిగినట్లైతే ఆ సరస్సులు నిండిపోయి వరదలు తప్పవని అంటున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని గ్లేసియర్లు రెండు బిలియన్ల మంది నీటి అవసరాలు తీరుస్తున్నాయి. ప్రపంచంలోని 10 అతి ముఖ్యమైన నదులకు హిమాలయాలే ఆధారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరెస్ట్పై మంచు కరిగిపోతే తొలుత వరదలు అనంతరం కోట్ల మందికి నీటి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
