
మలేరియా నివారణకు ఐసీఎంఆర్ కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ది చేస్తోంది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేస్తున్నారు. గతంలో ఉన్న వ్యాక్సిన్లు కేవలం మలేరియా పరాన్న జీవి ప్లాస్మోడియం ఫాల్సిపరం ఒక దశపై మాత్రమే పనిచేస్తాయి. ఈ కొత్త వ్యాక్సిన్ మలేరియా పరాన్న జీవి రెండు దశలపైనా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రీక్లినికల్ దశలో అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది. త్వరలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని అందుబాటులోకి రానుంది.. వివరాల్లోకి వెళితే.
మలేరియా నివారణకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) స్వదేశీ పరిజ్ఞానంతో 'అడ్‌ఫాల్సివాక్స్ (AdFalciVax)' అనే మల్టీ-స్టేజ్ మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను ICMR ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (RMRC), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ (NII) సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న మొదటి మలేరియా వ్యాక్సిన్.
అడ్‌ఫాల్సివాక్స్ అనేది రీకాంబినెంట్ చిమెరిక్ వ్యాక్సిన్. ఇది మలేరియా పరాన్నజీవి అయిన ప్లాస్మోడియం ఫాల్సిపరం రెండు కీలకమైన దశలను లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న చాలా వ్యాక్సిన్‌ల కంటే విభిన్నమైనది. అవి సాధారణంగా ఒకే దశను లక్ష్యంగా పనిచేస్తాయి.
ప్రీ-ఎరిథ్రోసైటిక్ (కాలేయ) దశ : మానవ శరీరంలోకి పరాన్నజీవి ప్రవేశించిన వెంటనే కాలేయంలో వృద్ధి చెందే దశ.
ట్రాన్స్‌మిషన్ (లైంగిక) దశ : మలేరియా వ్యాప్తికి కారణమయ్యే పరాన్నజీవి దశ.
ఈ వ్యాక్సిన్ మనుషులకు మలేరియా రాకుండా కాపాడటమే కాకుండా, వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది వ్యాధి సంక్రమణను తగ్గించి, సామాజిక వ్యాప్తిని కూడా నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
బెనిఫిట్స్...
ఇప్పటికే ఉన్న WHO సిఫార్సు చేసిన RTS,S/AS01 - Mosquirix, R21/Matrix-M వ్యాక్సిన్లు ఒకే దశలో రక్షణ కల్పిస్తాయి. అయితే అడ్‌ఫాల్సివాక్స్ రెండు దశల్లో రక్షణ కల్పిస్తుంది. పరాన్నజీవి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. ఈ వ్యాక్సిన్ తో దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి కూడా లభిస్తుంది. ఈ వ్యాక్సిన్ లో ముఖ్యమైన బెనిఫిట్ ఏమిటంటే.. ఇది గది ఉష్ణోగ్రత వద్ద తొమ్మిది నెలలకు పైగా పనిచేస్తుంది. రవాణా ,స్టోరేజ్ చాలా సులభం.
►ALSO READ | పోలీసులంటూ మహిళకు 9 గంటలు నరకం.. వీడియో కాల్ లో బట్టలు విప్పించి..
తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాక్సిన్. దీనిని సురక్షితంగా, సులభంగా ఉత్పత్తి చేయగల బాక్టీరియల్ సిస్టమ్ అయిన లాక్టోకాకస్ లాక్టిస్ లో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి అడ్‌ఫాల్సివాక్స్ ప్రీ-క్లినికల్ దశలో అద్భుతమైన ఫలితాలను చూపుతోంది. ఇది ఇంకా అభివృద్ధి ప్రారంభ దశల్లోనే ఉంది. క్లినికల్ ఉపయోగం కోసం ఆమోదం పొందలేదు.
ICMR ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ,విస్తృత వినియోగం కోసం అర్హత కలిగిన సంస్థలు, కంపెనీలు ,తయారీదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టెక్నాలజీ బదిలీ ద్వారా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మలేరియా రహిత భారతదేశం అనే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ స్వదేశీ వ్యాక్సిన్ ఒక కీలక సాధనంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.