పోలీసులంటూ మహిళకు 9 గంటలు నరకం.. వీడియో కాల్ లో బట్టలు విప్పించి..

పోలీసులంటూ మహిళకు 9 గంటలు నరకం.. వీడియో కాల్ లో బట్టలు విప్పించి..

డిజిటల్ అరెస్ట్ నేరాలు మళ్లీ పెరుగుతున్నాయ్. తాజాగా బెంగళూరులో ఇద్దరు మహిళలను నేరగాళ్లు పోలీసు అధికారులం అంటూ టార్చర్ చేశారు. తొమ్మిది గంటల పాటు కొనసాగిన ఘటన అందరినీ షాక్ కి గురిచేసింది.

బెంగళూరులో నివసించే మహిళ ఆమె స్నేహితురాలు థాయిలాండ్ నుంచి వచ్చాక నేరగాళ్ల వలలో చిక్కారు. ఉదయం 8856062795 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము ముంబై కొలాబా స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని.. జెట్ విమానయాన సంస్థ నరేష్ గోయల్ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంలో ఆమె పేరుందని, ఒక మర్డర్ కేసులో కూడా ఇరుక్కున్నారంటూ నమ్మబలికారు నేరగాళ్లు. తాను ఎలాంటి తప్పు చేయలేదని తాను థాయిలాండ్ నుంచి వచ్చానని సదరు మహిళ చెప్పింది. 

నేరగాళ్లు ఆమె డెబిట్ కార్డ్ వివరాలు చెప్పి తాము నిజమైన సీబీఐ అధికారులుగా నమ్మబలికారు. దీంతో బాధితులు కాల్ నిజమేనని అనుకున్నారు. వీడియో కాల్ ద్వారా సీబీఐ కార్యాలయానికి అనుసంధానిస్తున్నట్లు చెప్పిన నేరగాళ్లు.. వారిని డిజిటల్ అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 24 గంటల పాటు వాట్సాప్ వీడియో కాల్ లో అందుబాటులో ఉండాలన్నారు. అలాగే వారు చెప్పిన ఖాతాల్లోకి డబ్బు పంపాలంటూ 58వేల రూపాయలు కొట్టేశారు. 

అయితే ఇక్కడితో ఆగని మోసగాళ్లు మహిళలను మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలంటూ బట్టలు విప్పించారు. ఒంటిమీద ఉన్న పుట్టుమచ్చలు, గాయాలు, టాటూలను పరిశీలించారు. తమ ఇల్లు పూర్తిగా సర్వేలెన్స్ లో ఉందని ఇంట్లో నుంచి ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పినట్లు బాధితులు పోలీసులకు చెప్పారు. అయితే ఈ వీడియోలను రికార్డ్ చేసిన నేరగాళ్లు మహిళలను హేళనగా మాట్లాడి ఇబ్బందికి గురిచేశారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఇద్దరు మహిళల్లో ఒకరు తన స్నేహితులను సంప్రదించి తాము పడుతున్న ఇబ్బంది గురించి వెల్లడించింది. 

దీంతో అప్పటి వరకు తాము మోసగాళ్ల చేతిలో ఇరుకున్నట్లు గుర్తించిన మహిళలు స్నేహితుల సూచన మేరకు అప్రమత్తం అయ్యారు. అయినప్పటికీ వదలని నేరగాళ్లు మహిళలను బెదిరిస్తూ.. వారి వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. నేరగాళ్ల కాల్స్ బ్లాక్ చేసిన మహిళలు వెంటనే పోలీసులను సంప్రదించి కేసు నమోదు చేశారు.