టీకా తీసుకున్న లక్ష మందిలో 11 మంది మృతి 

టీకా తీసుకున్న లక్ష మందిలో 11 మంది మృతి 

చెన్నై: కరోనా మరణాలను తగ్గించడంలో వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్టడీలో నిరూపితమైంది. తమిళనాడులో లక్ష మంది పోలీసులకు వ్యాక్సినేషన్ చేయగా.. వారిపై మెరుగైన ఫలితాలు వచ్చాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లపై వ్యాక్సిన్ ఫలితాలు చాలా బాగా వచ్చాయని ట్వీట్ చేసింది. 

ఈ స్టడీ ప్రకారం.. 82 శాతం మందికి టీకా తొలి డోసు, 95 శాతం మందికి రెండో డోసు ఇచ్చారు. వీరికి ఫిబ్రవరి 1 నుంచి మే 14 మధ్య వ్యాక్సినేషన్ చేశామని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే ఏప్రిల్ 13 నుంచి మే 14 మధ్య 31 మంది పోలీసులు చనిపోయారని పేర్కొంది. ఈ మృతుల్లో టీకా తొలి డోసు తీసుకున్న వారు ఏడుగురని, రెండు డోసులు తీసుకున్న వారు నలుగురని, టీకా వేసుకోని వారు 20 మంది ఉన్నారని స్పష్టం చేసింది. తమిళనాడు స్టేట్ పోలీసు డిపార్ట్‌‌మెంట్‌‌తోపాటు వెల్లూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీతో కలసి ఐసీఎంఆర్ ఈ స్టడీని చేపట్టింది. ఈ పరిశోధనా వివరాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితం అయ్యాయి.