మాస్కు లేని వారిని అనుమతిస్తే 20వేలు ఫైన్

మాస్కు లేని వారిని అనుమతిస్తే 20వేలు ఫైన్

అమరావతి: ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసుల్లోనే కాదు.. దుకాణాలు.. వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి నిర్వాహకులు వద్ద మాస్కులు లేని వారిని తమవద్ద అనుమతిస్తే గరిష్టంగా రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామని వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. ఈ మేరకు  ఉత్తర్వులు జారీచేశారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని భావిస్తూ చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయని.. థర్డ్ వేవ్ ముప్పు మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలనుకేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ.. జిల్లా స్థాయి అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
కేంద్రం హెచ్చరికల నేపధ్యంలో ఆంక్షలు కఠినంగా అమలు
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపధ్యంలో కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఎక్కడపడితే అక్కడ జనం గుమిగూడుతుండడం.. మాస్కులు లేకుండా తిరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే కరోనా మళ్లీ మొదలయ్యేలా ప్రమాదం కనిపిస్తుండడంతో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కు ధరించని వారు ఎక్కడైనా కనిపిస్తే భారీ జరిమానా అంటే రూ.10 వేలు మొదలు రూ.20 వేల వరకు జరిమానా విధించాలని సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తారు.

జరిమానాతోపాటు దుకాణం 2 లేదా 3 రోజులపాటు మూసివేత

దుకాణాలు లేదా వ్యాపార సంస్తల వద్ద మాస్కులు లేని వారు కనిపిస్తే.. సదరు దుకాణ దారుని బాధ్యునిగా పరిగణిస్తూ.. జరిమానా విధించడంతోపాటు 2 లేదా 3 రోజులు దుకాణం మూసివేసే శిక్ష కూడా అమలు చేయనున్నారు. పోలీసులు, అధికారులే కాదు.. ప్రజలు ఎవరైనా ఎక్కడైనా కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా వాట్సప్‌ నెంబరును ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిత్యం రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. మాస్కులు ధరించని వారి నుంచి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్‌ఐలు సహా ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఇప్పటివరకు ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండగా తాజాగా పోలీసుశాఖకు కూడా ఇచ్చారు.