దళితబంధు కోసం లంచం అడిగితే సహించం: దానం నాగేందర్

దళితబంధు కోసం లంచం అడిగితే సహించం: దానం నాగేందర్

హైదరాబాద్: దళితబంధు ఇప్పిస్తామని ఎవరైనా లంచం అడిగితే సహించేదిలేదని..  ఇలాంటి వారి పేర్లు పేపర్లలో వేయిస్తానని  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లంచం ఇచ్చి పథకాలు పొందిన వారు ఎప్పుడైనా తనను నిలదీస్తారన్నారు.  ఊరికే ఇచ్చావా.. లక్ష రూపాయలు లంచం ఇచ్చా కదా అంటారని.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని పారదర్శకంగా..నిజాయితీగా వ్యవహరించాలని దానం నాగేందర్ సూచించారు. బంజారాహిల్స్ లేక్‌వ్యూ బంజారా ఫంక్షన్‌ హాల్‌లో రెండవ విడత దళిత బంధుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దళితబంధు పథకం ఉద్దేశాన్ని.. ప్రభుత్వ లక్ష్యాన్ని తెలియజేశారు.  

 ప్రతిఒక్క దళితుడికీ దళితబంధు అందిస్తాం

అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అదేశించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుర్తు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గములో మొదటి విడత లో 100 మందికి, రెండవ విడతలో మరో 500 మంది లబ్దిదారులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పథకాన్ని అర్హులైన వారందరికీ అందిస్తామని.. మధ్యలో ఎవరైనా.. లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కొద్దిమంది లంచాలు అడుగుతున్నట్లు తనకు సమాచారం ఉందని.. అయితే ఇలాంటి పద్ధతులు మానుకోవాలని హెచ్చరించారు.

మీరెవరైనా  లంచం అడిగితే.. తన దృష్టికి తీసుకురావాలని.. అలాంటి వారి పేర్లు పేపర్లలో వేయిస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.  దళితబంధు కోసం లంచం ఇచ్చినా.. తీసుకున్నా.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా దళితబంధు ఇస్తామని.. ఎవరు ఆందోళన చెందవద్దని.. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే బస్తీల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తామని దానం నాగేందర్ తెలిపారు.