బీజేపీ పవర్‎లోకొస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తం: రామచందర్ రావు

బీజేపీ పవర్‎లోకొస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తం: రామచందర్ రావు

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది బీసీ బిల్లు కాదు.. ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని పేర్కొన్నారు. గురువారం (ఆగస్ట్ 7) భువనగిరి జిల్లా బీజేపీ పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీసీ పేరుతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం లేదని విమర్శించారు. 

ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా అరెస్ట్ చేయలేదని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కేటననడానికి ఇదే రుజువని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‎కు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలు బీజేపీకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. 

భువనగిరి ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నరని... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో కమలం పార్టీకి భారీగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా మూసీ ప్రక్షాళన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాటలు చెప్పారని.. ఆయనవి ఉత్త మాటలేనని.. అవి కార్యరూపం దాల్చిలేదని విమర్శించారు. రాష్ట్రంలో యూరియాను మార్కెట్‎లో బ్లాక్ చేసి చేస్తున్నారు.. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు.